Suryaa.co.in

Andhra Pradesh

చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటున్న ముఖ్యమంత్రి

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య ఎద్దేవా

ఐదేళ్ల పాలనా కాలాన్ని పూర్తిగా నిరంకుశ నిర్ణయాలతో,మూర్ఖపు విధానాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశారని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుకుంటున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 151 మంది ఎమ్మెల్యేల బలం గూర్చి , వైనాట్ 175 గూర్చి, 90 శాతం హామీలు అమలు గూర్చి పదే పదే బీరాలు పలికిన వైకాపా ప్రభుత్వం ఉన్నచోట పనికిరాని ఎమ్మెల్యేలను పరాయి చోటకు పంపించే స్థితికి చేరిందని విమర్శించారు.

ఆరు నెలల్లో మంచి సిఎం అనిపించుకుంటానని ఒకసారి, సింహం సింగిల్ గా వస్తుందని మరోసారి, జగనన్నే మీ నమ్మకం అని ఇంకోసారి ఊదర గొట్టి మంత్రులను సైతం గంగిరెద్దుల్లా అటుపొండి, ఇటు రండి అని తిప్పలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండబోదన్నారు . రాజధాని ఉద్యమకారులు, విశాఖ ఉక్కు కార్మికులు, దళిత, బహుజన కులాలు రాష్ట్రంలోని సవాలక్ష సమస్యలను, ఆవేదనలను ఏకరువు పెట్టినా పెడచెవిన పెట్టారని తెలిపారు.

కోర్టులు చెప్పినా ఒక్కరోజు కూడా పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో సీట్లను తారుమారు చేస్తున్నారని, ఎవరికి సీటు దక్కుతుందో, ఎవరికి సీటు చిరుగుతుందో తెలియక మంత్రులు ,ఎమ్మెల్యేలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు బాలకోటయ్య పేర్కొన్నారు.

LEAVE A RESPONSE