– బీజేపీ నేతల హౌజ్ అరెస్ట్, కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులపై బండి సంజయ్ ఫైర్
– కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లాలనుకోవడమే తప్పా?
– ప్రజల ప్రాణాల కంటే సీఎం సభే పోలీసులకు ముఖ్యమా?
– ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న టీచర్లను అడ్డుకుంటూ టీఆర్ఎస్ నేతలకు అనుమతి ఇవ్వడమే న్యాయమా?
– అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా?
– ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్ పిలుపు
– తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని సాగనీయబోమని స్ఫష్టీకరణ
తెలంగాణలో బీజేపీ నేతల హౌజ్ అరెస్టు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండి పడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోందన్నారు. 317 జీవోపై ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులనూ ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు… పింకీల నిరసనలకు మాత్రం అనుమతినివ్వడం సిగ్గు చేటన్నారు.
తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని.. కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే అమలవుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన ప్రజాస్వామ్య రాజ్యాంగం కావాలా? నిర్బంధాల, హౌజ్ అరెస్టుల కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బీజేపీ అడ్డుకుని తీరుతుందని… ఇందుకోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.
జనగామలో నిన్న టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయాలపాలైన బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి బయలు దేరిన బీజేపీ నాయకులను హౌజ్ అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. గాయాలపాలైన కార్యకర్తలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టామిట్టాడుతుంటే… పోలీసులకు మాత్రం ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమంత్రి సభే ముఖ్యమైందని మండిపడ్డారు.
నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు, ఉద్యమకారులు ఎంతటి ఇబ్బందులు పడ్డారో…. కల్వకుంట్ల పాలనలోనూ నేడు అదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. నిర్బంధాలతో పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ను ప్రజల అష్టదిగ్బంధం చేసి ఫాంహౌజ్ కే శాశ్వతంగా పరిమితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పోలీసుల నిర్బంధాలూ, టీఆర్ఎస్ గూండాల దాడులతో బెదిరిపోయే పార్టీ బీజేపీ కాదని….కల్వకుంట్ల పాలనను సమాధి చేసే వరకు పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు.