Suryaa.co.in

Telangana

ప్రజాస్వామ్య గొంతు నులిమేసే కుట్ర

– సీఎం ధర్నా చేస్తే ఒప్పు….బీజేపీ దీక్ష చేస్తే తప్పా?
– ఇదెక్కడి న్యాయం… ప్రజాస్వామ్యవాదులారా మౌనం వీడండి
– బీజేపీ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ను కొనసాగించి తీరుతాం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద రేపు జరపతలపెట్టిన ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అత్యంత హేయమైన చర్య.
ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు, ఆందోళనలు చేసే వేదిక ఇందిరాపార్క్ ధర్నా చౌక్. ట్రాఫిక్ జాం, ప్రజలకు ఇబ్బంది పేరుతో ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టబోయే ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం విస్మయం కలిగిస్తోంది.

ఇందిరాపార్క్ ను ధర్నా చౌక్ గా పునరుద్దరించిన తరువాత టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి.సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశాయి. అప్పుడే లేని ఇబ్బంది బీజేపీ దీక్ష చేపడతానంటేనే వస్తోందా?ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిపేసే కుట్ర. బీజేపీని అణిచివేసే చర్యగా భావిస్తున్నాం. అసలు బీజేపీ పేరు వింటేనే ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోంది.

ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తుతున్న బీజేపీను అణిచివేయాలని అడుగడుగునా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నరు.ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అందులో భాగమే.సభలోకి బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించే విషయాన్ని పరిశీలించి స్పీకర్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకుని ప్రజాస్వామ్యస్పూర్తిని కాపాడాలని గౌరవ హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనను కూడా స్పీకర్ కాలరాయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం.

కేసీఆర్ ఫ్రభుత్వ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ బీజేపీ చేపట్టిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’కు అనుమతిని నిరాకరించడం కుట్ర పూరితం.
ధర్నా చౌక్ వద్ద సీఎంసహా టీఆర్ఎస్, కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన పోలీసులు బీజేపీ దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం ముమ్మాటికీ పక్షపాత చర్యే.

ప్రజాస్వామ్యవాదులారా….మేధావులారా… ప్రజా సంఘాల నేతల్లారా… టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక, పక్షపాత చర్యలపై స్పందించాలని కోరుతున్నా.
కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, మరెన్ని నిర్బంధాలు విధించినా ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం బీజేపీ పోరాడుతూనే ఉంటుంది. కేసీఆర్ అవినీతి-కుటుంబ-నియంత పాలనను అంతం చేసేదాకా ఉద్యమిస్తూనే ఉంటుంది.

అందులో భాగంగా ఎన్ని ఆంక్షలు పెట్టినా, మరెన్ని నిర్బంధాలు విధించినా రేపు (17.3.2022) జరపతలపెట్టిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ను యధాతథంగా కొనసాగిస్తాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకు కేసీఆర్ ఫ్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి తీరుతాం.

రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లాలని కాంక్షించే ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ప్రభుత్వ చెంప చెళ్లుమన్పించేలా బీజేపీ చేపట్టే ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’కు సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నా.

LEAVE A RESPONSE