Suryaa.co.in

Telangana

కేసీఆర్ గారూ.. పీఆర్సీ వేసి ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వండి

– సీఎంకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు నెలవారీ జీతాలు క్రమం తప్పకుండా తీసకోలేకపోతున్నారని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తక్షణమే వేతన సవరణ సంఘం ఏర్పాటుచేసి, ప్రతినెల ఒకటవ తేదీనే జీతాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని బండి స్పష్టం చేశారు. ఆ మేరకు ఆయన కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇదీ..

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి
తెలంగాణ ముఖ్యమంత్రి,
ప్రగతి భవన్, హైదరాబాద్.

విషయం : తక్షణమే వేతన సవరణ సంఘం (PRC)ను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జులై 1 నుండి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు చెల్లించాలని, ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కోరుతూ….

నమస్కారం…
ఈనెల 9న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారనే సమాచారం మా ద్రుష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న అంశాలను బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన మీ ద్రుష్టికి తీసుకురాదలిచాను. అందులో ప్రధానమైనది వేతన సవరణ సంఘం (PRC) ఏర్పాటు అంశం. 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేయడంతోపాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీ పాలనలో తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు.

ప్రతినెలా 1వ తేదీన జీతాలు తీసుకోవడం ఉద్యోగుల హక్కుగా ఉన్నప్పటికీ…. సక్రమంగా జీతాలు చెల్లించకుండా వారి హక్కులను కాలరాస్తున్నారు. 317 జీవో అమలు పేరుతో ఉద్యోగుల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డీఏలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.

చివరకు కీలకమైన PRC ఏర్పాటు, అమలు విషయంలోనూ మీరు తీవ్రమైన కాలయాపన చేస్తున్నారు. స్వరాష్ట్రంలో సీఆర్ బిస్వాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి PRC నివేదిక అమలులో మీరు చేసిన జాప్యంవల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు 21 నెలలపాటు పెంచిన జీతాన్ని నష్టపోయారు. ఈ ఏడాది జూన్ 30 నాటితో మొదటి PRC గడువు కూడా ముగియబోతోంది.

జూలై 1, 2023 నుండి కొత్త PRC అమల్లోకి రావాలి. కానీ ఇప్పటి వరుకు మీరు కనీసం PRC కమిషన్ ను నియమించకపోవడం సహించరాని విషయం. ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమే అవుతుంది.

పే రివిజన్ కమిషన్ నివేదిక లేకుండా PRCని ఎట్లా అమలు చేస్తారు? మీ వైఖరిని చూస్తుంటే ఏదో విధంగా జాప్యం చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు PRC ని ఎగ్గోటాలనే ధోరణి కన్పిస్తోంది. ఈ విషయంలో మీరు అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం సమర్ధనీయం కాదు. ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లి అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఉద్యోగులపట్ల కక్షపూరిత ధోరణి సరికాదు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలకు ద్రుష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త పే రివిజన్ కమిషన్ (PRC)ని ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు 3 నెలల గడువు విధించి నివేదిక తెప్పించుకుని ఈ ఏడాది జూలై నుండి కొత్త PRC ని అమలు చేయాలని కోరుతున్నాం. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం.

దీంతోపాటు గత సాధారణ ఎన్నికల్లో, ఆ తరువాత మీరు ఇచ్చిన హామీల్లో 99 శాతం నేటికీ అమలు కాలేదు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ నేటికీ రైతులకిచ్చిన రుణమాఫీ, ప్రీ యూరియా హామీలు అమలు కాలేదు. నిరుద్యోగులకు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి హామీల ఊసే లేదు.

దళితులందరికీ దళిత బంధు, మూడెకరాల భూమి, గిరిజనులందరికీ గిరిజన బంధు, చేనేత కుటుంబాలకు చేనేత బంధుతోపాటు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు, ఖాళీ జాగా ఉన్న వాళ్లందరికీ రూ.3 లక్షల చొప్పున ఆర్దిక సాయం వంటి ప్రధాన హామీలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడం క్షమించరాని విషయం.

రాబోయే కాబోయే మంత్రివర్గ సమావేశంలో పై హామీలపై చర్చించి తగిన నిధులు కేటాయించి వెంటనే అమలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని బీజేపీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో ఆయా అంశాల అమలు కోసం భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని, జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.

బండి సంజయ్ కుమార్, ఎంపీ,
అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ.

LEAVE A RESPONSE