– మహారాష్ట్ర లిక్కర్ కంపెనీ వ్యర్థాలతో గోదావరి కలుషితం
– పవిత్ర స్నానాలు చేయని భక్తులు
– వందల గ్రామాలకు గోదావరే ఆధారం
– వేల సంఖ్యలో చనిపోతున్న చేపలు
– జాలర్ల జీవితాలు అగమ్యగోచరం
– విచారిస్తామన్న మంత్రి తలసాని
మార్తి సుబ్రహ్మణ్యం
అది గలగల పారే గోదావరి. ఆ తాగు-సాగునీరే వందలాది గ్రామాలకు జీవనాధారం. నోరున్న మనుషులకయినా.. నోరు లేని జీవాలకయిఇనా! అంతేనా… ఆ గోదావరికి ఆనుకుని ఉన్నది బాసర జ్ఞానసరస్వతి దేవాలయం. అక్కడికి వచ్చే వేలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనానికి ముందు, ఆ నదిలో స్నానమాచరించడం ఆనవాయితీనే కాదు. అదో సంప్రదాయం కూడా. కానీ ఇప్పుడక్కడ గోదావరి నీళ్లు తాగాలంటేనే భయం. అక్కడ స్నానం చేయాలంటేనే వణుకు. ఈ దుస్థితి ఒక్క భక్తులకే కాదు. గోదావరి నీళ్లు తాగే వందలగ్రామాలు, రెండు జిల్లా ప్రజలది కూడా. దీనికి కారణం.. మహారాష్ట్రలోని ఓ లిక్కర్ కంపెనీ గోదావరి లోకి అక్రమంగా విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాలు. ఈ దారుణానికి నోరులేని మూగజీవాలు తలవాలుస్తున్నాయి. ప్రధానంగా చేపలు చచ్చిపోయి కుప్పలు తెప్పలుగా ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయి. దీనితో జాలర్ల జీవితం అగమ్యగోచరం. సుదీర్ఘకాలం నుంచి ఈ దారుణం విజయవంతంగా కొనసాగుతున్నా.. తెలంగాణ పాలకులకు పట్టదు. చేపలు చచ్చిపోతున్నా ఆ శాఖకు పట్టదు. మహారాష్ట్ర సర్కారును నిలదీసి, నిలువరించే ప్రయత్నాలూ కనిపించడం లేదు. ఇదీ పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర వద్ద నిర్నిరోధంగా జరుగుతున్న రసాయన ‘వ్యర్థ’ విషాదం. ఇక చదవండి.
జీవనది గోదావరి గరళాన్ని మింగుతోంది. మహారాష్ట్ర మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు బాసర దగ్గర గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో పూర్తిగా గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. ఏటా వరదల్లోకి మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలను వదులుతున్నారు. గోదావరి నది కలుషితం కావడంతో బాసర పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పరివాహక పట్టణాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, మలినాలు గోదావరిలో కలుస్తున్నాయి. నదీ పరివాహాక ప్రాంతంలో పరిశ్రమలు, పట్టణాలు, గ్రామాల నుంచి వస్తున్న వ్యర్థాలు, మలినాలు పూర్తిస్థాయిలో శుద్ధి చేయకపోవడంతో గోదావరి నది తన పవిత్రతను కోల్పోతోంది.
ఇప్పటికే ఈ నదీ జలాలలో స్నానం చేసేవారితో పాటు, తాగునీటికి ఉపయోగించడం వల్ల వివిధ రకాల వ్యాధులు, రోగాలు వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలను నదిలో పూర్తిస్థాయిలో శుద్ధి చేయకుండా కలుపుతుండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. కేంద్రం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న గోదావరి జల కాలుష్య నివారణ పథకం మూలనపడింది. కనీసం ఒక్క ఏడాది పాటు కూడా నీటిని శుద్ధి చేసిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో గోదావరి మరింతగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.
మహారాష్ట్ర, ధర్మాబాద్ చెందిన పయనీర్ డిస్టలరీస్ లిమిటెడ్ కంపెనీ నుంచి భారీ స్థాయిలో రసాయన వ్యర్థాలు కొట్టుకువస్తున్న వైనం బాసర స్థానికులతోపాటు, భక్తులనూ కలవరపెడుతోంది. ఈ నిర్లక్ష్యంపై తెలంగాణ సర్కారుతోపాటు, బాసర దేవస్థానం కూడా ఇప్పటివరకూ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డుకు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవ న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీని ఫలితంగా.. పంచగుడి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు యావత్తూ కెమికల్‌తో కలుషితమై నీటిలో కలిసిపోతున్న ప్రమాదకర పరిస్థితి. ప్రధానంగా నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని వందలాది గ్రామాలు ఈ జలాలపైనే ఆధారపడుతున్నారు. బాసర ఆలయానికి వస్తున్న భక్తులు కలుషిత నీటిలో స్నానాలు చేసేందుకు భయపడుతుండగా.. కలుషిత నీటి వలన వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్న వైనం, అటు మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికయినా మహారాష్ట్ర లిక్కర్ కంపెనీల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను నివారించేందుకు తెలంగాణ సర్కారు నడుంబిగించకపోతే, భవిష్యత్తులో అక్కడ మత్స్యసంపద పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
మా దృష్టికి రాలేదు: మంత్రి తలసాని
బాసర పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఈ దుస్థితిపై మత్స్యశాఖా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వివరణ కోరగా, ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదని చెప్పారు. ‘మీరు చెప్పినట్లు పరిస్థితి అంత సీరియస్‌గా ఉంటే మత్స్యకారులు మా శాఖకు ఈపాటికే ఫిర్యాదు చేసి ఉండాలి. మీరు చెప్పిన వాతావరణం ఉంటే, అక్కడ పరిస్థితి ఉలా ఉంటుందో చెప్పక్కర్లేదు. కానీ ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదు మాకు అందలేదు. దీనిపై నేను మత్స్యశాఖ అధికారులతో మాట్లాడతా’నని మంత్రి తలసాని వివరించారు.