– టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
జగన్ రెడ్డి.. బీసీలను ఉద్దరించామనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చమత్కరించారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటలు మీ కోసం…!
జగన్మోహన్ రెడ్డి బీసీలను మూడున్నరేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్నారు. పైగా బీసీలను జగన్మోహన్ రెడ్డే కాపాడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. దాసీలుగా చూస్తూ.. అణగదొక్కేందుకు జగన్ రెడ్డి కుట్ర లు చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా బీసీలను తీరని దగా చేస్తూ వస్తున్నారు. బీసీలను ఉద్దరిస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారే తప్ప చేసింది శూన్యం. ఎంపీ పదవి కోసం బీసీల ఆత్మాభిమానాన్ని జగన్ రెడ్డికి ఆర్.కృష్ణయ్య తాకట్టు పెట్టే కుట్ర జరుగుతోంది. బీసీ సబ్ ప్లాన్ నుండి 34వేల కోట్లు దారిమళ్లిస్తే బీసీల నాయకుడని చెప్పుకునే ఆర్.కృష్ణయ్య ఎందుకు ప్రశ్నించలేదు. కృష్ణయ్య లాంటి బీసీ ద్రోహులకు పదవులిచ్చి బీసీల్ని శాసించాలనుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి బీసీలను ఏ విధంగా అణగదొక్కుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు.
చంద్రబాబు ఐదేళ్లలో 3.75 లక్షల మందికి రుణాలిచ్చారు. మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎంతమందికి ఎన్ని రుణాలిచ్చారో తెలపాలి. ఉత్తుత్తి కార్పొరేషన్లతో బీసీల ఉద్దారణ అనడం సిగ్గుచేటు. జగన్ రెడ్డీ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాతను దూరం చేశారు. దీన్ని బీసీ ఉద్దారణ అంటే ప్రజలు నవ్వి పోదురుగాక. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్య, స్కిల్ డెవలప్ మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లను వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిలిపేసిందో తెలపాలి. అనేకమంది బీసీలను హత్య చేస్తున్నా బీసీ నాయకులెవరూ నోరెత్తడంలేదు. పైగా బీసీ మంత్రులకు సన్మానాలు. రాజ్యసభ సీటు కోసం బీసీ జాతి హక్కుల్ని తాకట్టు పెట్టడం సిగ్గుచేటు. ఎంపీ సీటు ఇవ్వడానికి ఏపీలో ఒక్క బీసీ నాయకుడు కూడా లేడా? తెలంగాణ నాయకుడికి ఏపీలో రాజ్యసభా? ఇదెక్కడి అన్యాయం? సొంత రాష్ట్రంలో 26 కులాల్ని బీసీల నుండి తీసేస్తే కృష్ణయ్య నోరెత్తకపోవడం ఏపీకి ద్రోహం చేయడమే.
రిజర్వేషన్లు రద్దు చేసి 16,800 మంది బీసీలకు పదవులనుండి దూరం చేశారు. ఉత్తరాంద్రలో విజయ సాయిరెడ్డికి చెప్పకుండా బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్క పనైనా చేయగలరా?, చేసే ధైర్యముందా? తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీనవర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది. రాజ్యాధికారాలు అందించింది.వారికి స్వయం ఉపాధి కల్పించింది. వారి ఆర్థిక ఎదుగుదలకు రుణాలందించింది.
తెలుగుదేశం హయంలో 90శాతం సబ్సిడీతో బీసీలకు వృత్తి పరికరాలను అందజేసి ఆదుకుంది. నేడు బీసీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. బీసీ కార్పొరేషన్ ఆఫీసుల్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొనివుంది. ఏపీ బీసీల్లో చీలిక తెచ్చి బీసీలను బలహీనపరచడానికి తెలంగాణ నుండి కృష్ణయ్యను అరువుకు తెచ్చుకున్నారని ప్రజలు గ్రహించాలి. తన సొంత రాష్ట్రం తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తీసేస్తే నోరు మెదపని ఆర్. కృష్ణయ్య ఆంధ్రలో బీసీలను ఎలా ఉద్ధరిస్తారని అనుకుంటారు? వైసీపీ బీసీ నాయకులు.. రాష్ట్రంలోని బీసీ సమస్యలమీద మాట్లాడకుండా బీసీ సంఘాల నోరు మూయిస్తున్నారు. వైసీపీ బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. 56 కార్పొరేషన్ల ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. వైసీపీ బీసీ నాయకులు ఆత్మగౌరవంతో మాట్లాడాలి. బీసీ జాతి ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వైసీపీ బీసీ నాయకులపై ఉంది. బీసీల్ని వంచిస్తున్న జగన్ రెడ్డిని గద్దె దించాలి. బీసీలంతా ఏకమై గర్జించాలి. ఏపీలోని బీసీలంతా ఏకమవ్వాలి. బీసీల్ని వంచించిన జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తెలిపారు.