* సత్ఫలితాలిచ్చిన మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్
* బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ శిక్షణ
* 241 మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా నియామకం
* సివిల్ సర్వీసెస్ కోచింగ్ తోనూ ప్రభుత్వ ఉద్యోగులుగా మరికొందరు
* ప్రభుత్వ ఉద్యోగాలుగా బీసీ యువతే లక్ష్యం
– మంత్రి సవిత
అమరావతి : బీసీ నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న సత్ఫలితాలిస్తున్నాయి. వివిధ పోటీ పరీక్షల నిమిత్తం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా డీఎస్సీ, సివిల్స్ కోచింగ్ ను వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం శిక్షణ అందజేసింది.
ఈ శిక్షణతో తాజాగా నిర్వహించిన డీఎస్సీ సహా పలు ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలో బీసీ నిరుద్యోగ అభ్యర్థులు సత్తా చాటారు. కూటమి ప్రభుత్వం అందజేసిన శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ, 241 మంది టీచర్ పోస్టులు సాధించగా, బ్యాంకు, పోలీసు సహా ఇతర ప్రభుత్వ పోస్టులను కూడా బీసీ అభ్యర్థులు సాధించారు. 2024 జూన్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలకు వెన్నుదన్నుగా నిలిచింది.
ముఖ్యంగా బీసీ యువతను ఉన్నత స్థానాల్లో నిలపాలన్న లక్ష్యంతో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా మెగా డీఎస్సీ, సివిల్స్ సర్వీసెస్ కు ఉచిత కోచింగ్ అందజేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహణ చేపట్టింది. అత్యధిక ఉపాధ్యాయ పోస్టులను బీసీ నిరుద్యోగ యువత సాధించాలన్న లక్ష్యంతో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభించింది.
జిల్లా కేంద్రానికి సుదూరంలో ఉండే మహిళలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారి సౌలభ్యం కోసం ఆన్ లైన్ ద్వారా కూడా ఉచిత డీఎస్సీ శిక్షణ అందజేసింది. ఇలా ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా 6,470 మందికి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా మెగా డీఎస్సీ సన్నద్ధతకు ఉచిత శిక్షణ అందజేశారు. సివిల్ సర్వెసెస్ కు కూడా 83 మంది బీసీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఉచిత శిక్షణ అందజేసింది. రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని గొల్లపూడి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఉచిత శిక్షణ అందజేసింది.
241మంది టీచర్లగా బిసీ బిడ్డలు…
బీసీ యువత అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్న సంకల్పంతో నిర్వహించిన ఉచిత డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ శిక్షణ ఎంతో దోహదం చేసింది. బీసీ స్టడీ సర్కిళ్ల ఉచిత శిక్షణ కేంద్రాల ద్వారా 1,674 మందికి, ఆన్ లైన్ లో ద్వారా మరో 4,774 మందికి.. మొత్తం 6,470 మందికి ఉచిత శిక్షణ డీఎస్సీ శిక్షణ అందజేశారు. వారిలో 241 మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారు. కర్నూల్ నుంచి 36, అనకాపల్లి నుంచి 40, నెల్లూరు నుంచి 17, కృష్ణా నుంచి 10 మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారు.
ఈస్ట్ గోదావరి నుంచి ఆరుగురు, చిత్తూరు నుంచి ఎనిమిది, పల్నాడు నుంచి ముగ్గురు, కడప నుంచి 12 మంది ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. పార్వతీపురం మన్యం,బాపట్ల, నంద్యాల నుంచి ఒక్కొక్కరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం నుంచి ఏడుగురు చొప్పున, అన్నమయ్య, కోనసీమ నుంచి ముగ్గురు చొప్పున టీచర్ పోస్టులకు ఎంపికయ్యారు.
గుంటూరు నుంచి 12 మంది, కాకినాడ నుంచి నలుగురు, ఎన్టీఆర్ జిల్లా నుంచి ఆరుగురు, ప్రకాశం నుంచి ఎనిమిది మంది గురువులుగా ఎంపికయ్యారు. సత్యసాయి జిల్లా నుంచి ఇద్దరు, తిరుపతి నుంచి 13 మంది, విశాఖపట్నం నుంచి అయిదుగురు, విజయనగరం నుంచి 14 మంది, వెస్ట్ గోదావరి 12 మంది బీసీ అభ్యర్థులుగా టీచర్లగా బాధ్యతలు చేపట్టనున్నారు.
సత్ఫలితాలిచ్చిన సివిల్ సర్వీసెస్ కోచింగ్
మెగా డీస్సీతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూటమి ప్రభుత్వం అందజేసింది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ కోచింగ్ వల్ల కూడా బీసీ నిరుద్యోగ యువత ఎంతో లబ్ధిపొందింది. కేవలం అయిదు నెలల పాటు సాగిన ఈ కోచింగ్ వల్ల గ్రూప్ 2 మెయిన్స్ కు 12 మంది, ఆర్.ఆర్.బి లెవల్ 1కు పది మంది, ఎఫ్.ఆర్.వో ప్రిలిమ్స్ కు ఇద్దరు, మెయిన్ కు ఒకరు అర్హత సాధించారు. ఆరుగురు అభ్యర్థులు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు.
ఆర్.ఆర్.బి లోకో పైలట్ గా మరో అభ్యర్థి ఎంపికయ్యాడు. బెల్, గేట్ లో ఒక్కొక్కరు అర్హత సాధించారు. ఎస్.ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో మరో అభ్యర్థి విజయం సాధించాడు. ఇలా సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ను బీసీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా బీసీ యువత
అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ యువత స్థిరపడాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోసం బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ నిర్వహించాం. ప్రభుత్వ సంకల్పాన్ని బీసీ యువత నిజం చేస్తూ, 241 మంది ఉపాధ్యాయులుగా నియమిమతులయ్యారు. సివిల్ సర్వీసెస్ కోచింగ్ వల్ల కూడా కొందరు బీసీ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
ఇదే స్ఫూర్తితో బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా బీసీ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నాం. బీసీ నిరుద్యోగ యువతకు డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం ఏపీ బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు అందజేసింది.