– ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ డిమాండ్
– ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద విద్యార్థుల నిరసన ధర్నా
హైదరాబాద్: రాష్ట్రంలోని వేలాది మంది బీసీ విద్యార్థులు నెలల తరబడి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ నేతృత్వంలో, ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమానికి అనేక బీసీ సంఘాలు సంఘీభావం ప్రకటించగా, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ , మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ తదితర ప్రముఖులు హాజరై విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ:.. “బీసీ విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం అత్యంత నిరాశ కలిగించేది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజుల బకాయిలను విడుదల చేయకుండా వాయిదా వేయడం అన్యాయమే కాక సామాజిక అసమానతలకు దారితీసే చర్య. విద్య అనేది హక్కు – దానిని అందించడం ప్రభుత్వ బాధ్యత. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే, ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రజా ఉద్యమంగా మారుతుంది. విద్య అనేది వాయిదా వేయలేని హక్కు. దానిని నిరాకరించే ప్రయత్నాన్ని బీసీ విద్యార్థులు సహించరు.” అని స్పష్టం చేశారు.