Suryaa.co.in

Andhra Pradesh

బీసీల అడ్డా తెలుగుదేశం పార్టీ

-బీసీల బతుకులు మార్చేలా ఐదేళ్లూ పని చేద్దాం
-వీరంకి వెంకట గురుమూర్తితో బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ

రాష్ట్రంలోని ప్రతి బీసీ బిడ్డకు న్యాయం చేసేలా అను నిత్యం పనిచేద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. విజయవాడలోని నివాసంలో సవితమ్మను బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో బీసీ సాధికార సమితి నాయకులు కలిశారు.

రాష్ట్రంలో సగానికి పైగా జనాభా బీసీలే ఉన్నప్పటికీ అన్ని రకాలుగా బీసీలు అవస్థలు పడుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే గురుతర బాధ్యత తనకు చంద్రబాబు అందించడం అదృష్టంగా భావిస్తున్నానని సవితమ్మ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి బీసీకి సంక్షేమ ఫలాలు అందించి, సాధికారత దిశగా నడిపించే యజ్ఞంలో అను క్షణం అండగా ఉంటానన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు తొలి నుండి వెన్నెముకగా నిలిచారని, ఇప్పుడు కూడా అదే స్థాయి ఫలితాలిచ్చి ఆదరించారన్నారు.

బీసీల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చి ఆర్ధికంగా సమాజికంగా, రాజకీయంగా మెరుగైన స్థానంలో నిలపాలనే చంద్రబాబు విజన్‌కు తగ్గట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో బీసీలకు దగా చేశారు. సంక్షేమ పథకాల నుండి అన్ని రకాలుగా అన్యాయం చేశారు. మన ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఏ ఒక్కరూ ఆలోచించని విధంగా మేలు చేసి చూపిస్తానని సవితమ్మ తెలిపారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో బీసీ సంక్షేమానికి గతంలో చంద్రబాబు చేపట్టిన పనుల్ని పరిశీలించాలని, బీసీ భవన్స్ లాంటి మెరుగైన కార్యక్రమాలను పునరుద్దరించాలని గురుమూర్తి విన్నవించారు. అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టో, బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. బీసీలంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు. ప్రతి కులానికి, ప్రతి వర్గానికి న్యాయం చేసి బీసీలపై తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని చూపిద్దామని వీరంకి వెంకట గురుమూర్తి తెలిపారు.

బీసీ రాష్ట్ర నాయకులు బొడ్డు వేణుగోపాల్ రాష్ట్ర బిసి సోషల్ మీడియా కన్వీనర్ రాఘవేంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ చేనేత నాయకులు డివి సుబ్బారావు రాష్ట్ర మేధర కన్వీనర్ ఏసుబాబు రాష్ట్ర దాసరి సాధికార సమితి కన్వీనర్ తుపాకుల అప్పారావు రాష్ట్ర నగరాల సాధికార సమితి కన్వీనర్ మరుపిళ్ళ తిరుమలేష్ రాష్ట్ర బట్రాజ్ సాధికార సమితి కన్వీనర్ ప్రసన్నాంజనేయరాజు ఈరోజు మంత్రి గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

LEAVE A RESPONSE