◆ బీసీ రిజర్వేషన్ల చట్టం చుట్టూ సీఎం శుద్ధ అబధ్ధాలు
◆ 50% పరిమితి పాపం కాంగ్రెస్, బిజెపిలదే
◆ బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ సర్కస్ ఫీట్లు నవ్వులపాలు
– శాసనమండలి విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల హామీ మోసం బట్టబయలు కావడంతో, దిక్కుతోచని సీఎం రేవంత్ రెడ్డి దిగజారి గత ప్రభుత్వంపై నిందలేస్తుండటం విడ్డూరంగా ఉందని శాసనమండలి విపక్ష నేత మధుసూదనాచారి, మాజీమంత్రి జోగు రామన్నలు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై సోమవారం చేసిన వ్యాఖ్యలను సంయుక్త పత్రికా ప్రకటన ద్వారా మధుసూదనాచారి, జోగు రామన్నలు తీవ్రంగా ఖండించారు. పాపన్న విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమంలో సీఎం బీసీ రిజర్వేషన్ల చట్టంపై నోటికొచ్చినట్లుగా అసత్యాలు వల్లించారన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం చట్ట,న్యాయపర ప్రయత్నాలు ఎన్నో చేసిందని,చివరకు ప్రధాని నరేంద్ర మోదీని సహితం కేసీఆర్ కలిసి రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని విజ్ఞప్తి చేశారన్నారు. రిజర్వేషన్లపై 50% పరిమితి విధించింది సుప్రీంకోర్టు అయితే, పార్లమెంట్ లో పరిమితిని ఎత్తివేసే చర్యలు చేపట్టకుండా సుధీర్ఘకాలం ద్రోహం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వాలని దుయ్యబట్టారు.
కనీసం తమిళనాడు తరహాలో తెలంగాణ రిజర్వేషన్ల పెంపును తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చడం ద్వారానో లేదా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపు హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ పార్లమెంట్ లో చట్టం చేయాలని నాటి సీఎం కేసీఆర్ ప్రధానిని ఎన్నోసార్లు డిమాండ్ చేశారని వివరించారు. కానీ కాంగ్రెస్ చారిత్రక ద్రోహం, బిజెపి వర్తమాన వంచన కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రధాన అవరోధంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో అనేక సంక్షేమ పథకాల అమలు,ఆత్మ గౌరవ భవనాలు,గురుకులాలు ఇలా బీసీ వర్గాల అభివృద్ధి కోసం చారిత్రాత్మక కృషి జరిగిందన్నారు. రాజకీయంగా బీసీల ప్రాతినిధ్యం పెంచడానికి సహితం మార్కెట్ కమిటీలు, జెడ్పీ చైర్మన్ లు తదితర కీలకమైన పదవుల్లో బీసీ వర్గాలకు సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు కల్పించారని వివరించారు.
కానీ రెండేళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ సర్కార్ కనీసం కామారెడ్డి డిక్లరేషన్ లోని ఒకటి రెండు హామీలు కూడా అమలు చేయలేక చివరికి ఊరించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కూడా చేతులెత్తేసిందని దుయ్యబట్టారు.హైదరాబాద్ లో హంగామా, ఢిల్లీలో డ్రామా తప్ప కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశంలో సాధించిందేంలేదన్నారు. ఇప్పటికైనా మోసపూరిత వైఖరి మానుకొని, బీసీలతో చెలగాటం ఆపెయ్యాలని వారు సూచించారు.
గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వ ప్రయత్నాలు, బీహార్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రయత్నాల అనుభవాలు,సుప్రీంకోర్ట్, వివిధ రాష్ట్రాల హైకోర్ట్ తీర్పులు అన్నీ స్పష్టంగా తెలిసికూడా కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంపు హామీతో బీసీలను మోసగించిందని దుయ్యబట్టారు. తీరా గద్దెనెక్కిన తర్వాత అయినా కనీస చిత్తశుద్ధి ప్రదర్శించకుండా సర్వే, కమిషన్ ల నివేదికలు, చట్టాల రూపకల్పనలో కనీస ప్రమాణాలు పాటించకుండా కుట్ర చేసిందన్నారు.
కేంద్ర సర్కార్ కొర్రీలకు కాంగ్రెస్ సర్కారే అవకాశాలు కల్పించి, తీరా ఢిల్లీ ధర్నాలో మోదీ ఇవ్వడని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకొని బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటామని గప్పాలు కొట్టి బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యంకానేకాదని పరోక్షంగా కుండబద్దలు కొట్టి కుట్రను బయటేసుకున్నదే సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న డ్రామాలు, సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై నోటితో చెప్పి నొసటితో వెక్కిరిస్తున్న తీరు బీసీల మనసులను తీవ్రంగా గాయపరించిందన్నారు.
ఇప్పటికే దేశ బీసీల చేతిలో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బలు తిన్నదని,రాబోయే కాలంలో తెలంగాణలో మళ్ళీ కోలుకోకుండా కాంగ్రెస్ కుప్పకూలిపోతుందని శాసనమండలి విపక్ష నేత మధుసూదనాచారి, మాజీమంత్రి జోగు రామన్న హెచ్చరించారు.