- ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎ.కొండూరు గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితులను కాపాడండి!
- ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధిత ప్రాంతాలకు కృష్ణా జలాలు సరఫరా చేయాలి !!
- కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలి !!!
- పాడెక్కుతున్న ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ… సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యాన ఆగస్టు 27,28,29 తేదీలలో ఎ.కొండూరు నుండి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం మరియు గంపలగూడెం మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు.
స్థానిక హానుమాన్ పేట, దాసరిభవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంగా ఎ.కొండూరు, చీమలపాడు పరిసర ప్రాంతాల గ్రామ, గిరిజన తండాలలో 300 మందికి పైగా, ఎ.కొండూరు మండలం హానుమాన్‌లంక గ్రామంలో గిరిజనులు ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేసారు. వందల మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
తాము త్రాగుతున్న మంచినీళ్ళే కబలిస్తున్నా ఊరు వదల లేక ఊపిరి వదులుతున్నారని పేర్కొన్నారు. 50కోట్లతో కృష్ణజలాలను త్రాగునీటిని పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పిన నాటి ప్రభుత్వ వాగ్దానాలు ఆచరణలో నేటికీ అమలు కాలేదని విమర్శించారు.
ఫ్లోరైడ్, సిలికాన్ కలిసిన నీటిని త్రాగిన గిరిజన తండాల ప్రజలు కిడ్నీ వ్యాధి బారినపడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా, ప్రభుత్వం కంటినీటి తుడుపుగా ఏర్పాటు చేసిన ఎ.కొండూరు డయాలసిస్ సెంటర్లో అర్హత కలిగిన నిపుణులు, అంబులెన్స్ లేకపోవుట వలన గిరిజనుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ‘‘జలజీవన్ మిషన్’’ అడుగు ముందుకు కదలలేదన్నారు.
కొండపల్లి, ఇబ్రహీంపట్నంలలో పరిశ్రమల నుండి వెలువడుతున్న పారిశ్రామిక వాయు కాలుష్యం వలన తీవ్రమైన అనారోగ్యానికి ప్రజలు గురవుతున్నారని చెప్పారు. వి.టి.పి.ఎస్ నుండి వెలువడే బూడిదతో ప్రజలు సహజీవనం చేస్తున్నారని తెలిపారు. 2000 పరిశ్రమలకు కొండపల్లి, ఇబ్రహీంపట్నం పారిశ్రామిక కేంద్రాలుగా ఉన్నాయన్నారు. కాలుష్య నివారణకు వరుసవెంబడి ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు ‘‘నిమ్మకు నీరెత్తినట్లు’’గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
‘‘పాడెక్కుతున్న ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని’’ కోరుతూ సిపిఐ ఆధ్వర్యాన ఆగస్టు 27,28,29 తేదీలలో రాజకీయాలకు అతీతంగా తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరులోని డయాలసిస్ సెంట్రల్ నుండి విజయవాడ కలెక్టరు కార్యాలయం వరకు జరిగే ‘‘ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర’’ నిర్వహించనున్నట్లు తెలిపారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జరగనున్న ఈ పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికి గ్రామ గ్రామాన ప్రజలు పాదయాత్రలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సమావేశంలో ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్నీడి యలమందరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు, ఎ.కొండూరు మండల కార్యదర్శి మేకల డేవిడ్, తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు లంకా గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.