– వరుస సవాళ్లను అధిగమించి 2024 ఎన్నికల్లో మరో ఘన విజయం దిశగా పరుగులు
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టి ఏడాది నిండడానికి రెండు నెలల ముందు కొవిడ్–19 మహమ్మారి దేశాన్ని చుట్టుముట్టింది. దాన్ని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా 2020 మార్చి 24 నుంచి తొలి దశ లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటికి పది మాసాలుగా సామాన్య ప్రజానీకానికి అవసరమైన కొత్త పథకాలతో ముందుకు పరుగులు తీస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురైన మొదటి అడ్డంకి ఇది.
అయితే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను పీడిస్తున్న కరోనావైరస్ అత్యధిక ప్రజానీకానికి సోకకుండా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. అప్పటికే పేదలు, దిగువ మధ్య తరగతి జనం కోసం అమలులోకి వచ్చిన ఆర్థిక సహాయ పథకాలకు అదనంగా కొవిడ్ లాక్ డౌన్ కాలంలో పేదలకు ఉచిత రేషన్ వంటి తక్షణ తోడ్పాటు కార్యక్రమాలను వైఎస్సార్సీ సర్కారు ప్రవేశపెట్టింది.
కొవిడ్–19 సృష్టించిన అననుకూల పరిస్థితులు ఏపీలో సామాజిక, ఆర్థిక సంక్షోభాలకు దారితీయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంతర జాగరూకతతో, చలనశీలతతో ప్రజలను ఆదుకోవడంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కన్నా ముందు నిలబడింది. ఈ వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం గుర్తించి ఆంధ్రప్రదేశ్ సర్కారును ప్రశంసించింది. లాక్ డౌన్ వల్ల సాధారణ ప్రజాజీవితం స్తంభించింది. మామూలు ఉత్పత్తి, సేవలు వంటి ఉత్పాదక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయం కోల్పోయిన పేదలకు వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు అండగా నిలిచింది.
మధ్య దళారులు లేని నగదు బదిలీ కార్యక్రమాలతో బలహీనవర్గాల ప్రజల కొనుగోలు శక్తిని క్షీణించిపోకుండా నిలబెట్టింది. ఇలా కరోనావైరస్ సృష్టించిన బీభత్స వాతావరణంలో ప్రజలకు ఆసరాగా ప్రభుత్వం నిలుస్తూ ఏడాది కాలం అలాగే ముందుకుసాగింది. కరోనావైరస్ ఇక నెమ్మదించించి, కొంత వరకు ఆంధ్ర ప్రజలు, ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవచ్చనుకునే సమయానికి రాష్ట్రంలోని అనేక జిల్లాలను భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు అల్లకల్లోలంలోకి విసిరేశాయి.
కొవిడ్ మహమ్మారి మందగించాక భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు
2021 నవంబర్ మాసంలో అకాల వర్షాలు ఏపీని ముంచెత్తాయి. నెల్లూరు, నాలుగు రాయలసీమ జిల్లాలను మున్నెన్నడూ కనీవినీ ఎరగని భారీ వర్షాలు కుదిపేశాయి. ప్రజాజీవితాన్ని ఊహించనలవి కాని రీతిలో అతలాకుతలం చేశాయి. అయినా ప్రభుత్వం తక్షణ సహాయ, పునరావాస చర్యలు తీసుకుంది. వాయువేగంతో ప్రభుత్వ సిబ్బందిని నీటమునిగిన ప్రాంతాలకు తరలించి ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని కాపాడగలిగింది.
2021లో వచ్చిన జల ప్రళయాల వల్ల రాష్ట్రంలో 46 మంది మరణించారు. దేశంలో 2021లో వచ్చిన వరదలు, భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో వైఎస్సార్సీ ప్రభుత్వ ముందస్తు, తక్షణ సహాయ కార్యక్రమాల ఫలితంగా జన నష్టంలో మన రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ జాగరూకత, ముందు జాగ్రత్తల కారణంగా వేలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగారు. జలమయమైన ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలను అతి తక్కువ సమయంలో మూమూలు పరిస్థితుల్లోకి తీసుకురాగలిగారు.
తర్వాత 2022లో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే కొవిడ్–19 ముందు నాటి పరిస్థితులను రాష్ట్ర సర్కారు పునరుద్ధరించగలిగింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలోకి పెద్ద మొత్తంలో వచ్చిన కొత్త పెట్టుబడులు, ఆరంభమైన వివిధ పరిశ్రమల వల్ల రాష్ట్ర జీఎస్డీపీ అంచనాకు మించి పెరిగింది. అంతకు ముందు కేంద్రంలోగాని, రాష్ట్రంలోగాని మంత్రిగా పనిచేసిన అనుభవం లేని యువ ముఖ్యమంత్రి హయాంలో ఇలా మొదటి నాలుగేళ్లు విజయవంతంగా పూర్తయ్యాయి.
చివరి, ఐదో ఏడాదిలో కూడా అనుకున్న అభివృద్ధి లక్ష్యాలు సాధించడం సాధ్యమేనని సూచనలు అందుతున్నాయి. ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన మొదటి ఐదేళ్ల పదవీ కాలం జనరంజక పాలనతో ముగించి, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో వరుస విజయం సాధించడానికి ముందుకు సాగుతోంది. నవ్యాంధ్ర ప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల్లో కేవలం తన పనితీరుతో ప్రజల మనస్సుల్ని పదే పదే గెలుచుకునే మొదటి రాజకీయపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి సన్నద్ధమౌతోంది.