హైదరాబాద్ : సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్ లో ఏర్పాటు చేశారని.. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని తెలిపారు.
ప్రేక్షకులతోపాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారన్న సమాచారం తమకు లేదని తెలిపారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు ఆ సమాచారం చెప్పలేదని పేర్కొన్నారు. దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలిపారు. పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదన్నారు.
ప్రేక్షకుల మధ్య తోపులాట
నటీనటులకు కూడా ఎటువంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. 9.30 కి తన వ్యక్తిగత భద్రత సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నారని.. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడం ప్రారంభించారని, అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో థియేటర్ లోని కొంత మందితో అల్లు అర్జున్ కలిసి లోపలికి వెళ్లారని తెలిపారు. దీంతో ప్రేక్షకులకు మధ్య తోపులాట చోటుచేసుకుందని వివరించారు.
రేవతి మృతి
ఇదే సమయంలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అతని కుమారుడుతో ఆ ప్రాంతంలో ఉందని..అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరాడలేదని..అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది 13 ఏళ్ల శ్రీతేజ్ కు సిపిఆర్ చేశారని, వెంటనే రేవతి కుమారుడు శ్రీ తేజను దుర్గాబాయి దేశముఖ ఆసుపత్రి తరలించారని తెలిపారు. అయితే, అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు.
శ్రీ తేజను మరో ఆసుపత్రికి తరలించాలని అక్కడ వైద్యులు సూచించారన్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పలు సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.