-దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్ గా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దండి
-వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయండి
-గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టుపట్టించడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది
-కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీ సేకరించాలి
-ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత తప్పని సరి…రోగులకు శుభ్రమైన బెడ్ షీట్లు అందించాలి
-డోలీ మోతలు కనిపించకూడదు…ఫీడర్ అంబులెన్స్ ల ద్వారా రోగులను తరలించాలి
-క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
-వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : వైద్య ఆరోగ్య శాఖలో 2014-19 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అస్తవ్యస్థ విధానాలతో గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టు పట్టించిందని, తద్వారా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మళ్లీ నమ్మకం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ….‘‘ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలి. ఆసుపత్రి రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్ మెంట్, ఇచ్చే మెడిసిన్ వివరాలు కూడా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది.
రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంత మంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలి. కిడ్నీ సమస్య కారణాలపై అధ్యయనం చేయాలి. కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి సదుపాయంపైనా లోతైన అధ్యయనం చేయాలి. గతంలో ఉద్దానంలో పూర్తిస్థాయిలో రీసెర్చ్ చేయడం వల్లే పూర్తిస్థాయిలో సమస్యను గుర్తించగలిగాం. ఉద్దానంలాగే ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి.
పేదలకు అందుబాటులో ఉండేలా సిటీ స్కాన్ సర్వీసెస్ ను ముందుగా అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలి. ప్రి ల్యాబ్ టెస్ట్ ల అనంతరం పేషెంట్లకు సరైన విధానంలో మెడిసిన్ ఇవ్వగలిగితే 50 శాతం కంట్రోల్ చేయొచ్చు. రోగులకు డైట్ ప్లాన్, న్యూట్రిషన్ పై అవగాహన కల్పించగలిగితే వ్యాధుల నుండి కాపాడవచ్చు. రాష్ట్రంలో టీబీ రోగులు ఎంతమంది ఉన్నారో సమగ్ర అధ్యయనం చేసి వారికి కంటిన్యూగా మెడిసిన్ అందించాలి.
ఆసుపత్రులలో ప్రసవం తర్వాత శిశువుల మిస్సింగ్ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి…మిస్సింగ్ కేసులు వస్తే అధికారులపై చర్యలు తప్పవు. ఎన్టీఆర్ బేబీ కిట్స్ ను మళ్లీ తల్లులకు అందించాలి. బేబీలకు అవసరమైన సామాగ్రిని కిట్స్ ద్వారా అందించాలి. ప్రతి స్కూలులో పిల్లలకు కంటి పరీక్షలు చేసిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారో రిపోర్టు చేయాలి. టెలీ మెడిసిన్ కు గతంలో వరల్డ్ బ్యాంకు నుండి రూ.2,300 కోట్లు నిధులు తీసుకొచ్చాం.
కార్పొరేట్ లెవల్లో సేవలు అందించాలని నిర్ణయించాం. గ్రామాల్లో ఉండేవారికి టెలీ మెడిసిన్ ద్వారా మంచి డాక్టర్లతో అందించాలని నిర్ణయించాం. కానీ దాన్ని గత ప్రభుత్వం సరిగా అమలు చేయలేదు. టెలీ మెడిసిన్ పై ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి.
అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నాం. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశంపై పూర్తిస్థాయిలో సమాచారం కోసం పంచాయతీ రాజ్ శాఖతో కలిసి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలి’ అని సీఎం అన్నారు.
డోలీ మోతలు కనిపించకూడదు
‘ఫీడర్ అంబులెన్స్ కు సాధారణ అంబులెన్స్ కు కనెక్టివిటీ పెంచాలి. డోలీతో ఇంకా మోసుకొస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. డోలీ మోతలు మళ్లీ రిపీట్ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం. ఫీడర్ అంబులెన్స్ లు వెళ్లగలిగినప్పటికీ సాధ్యంకాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా నేనే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తా. 104 అంబులెన్సుల పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందా లేదా అన్నది ముఖ్యం.
ఏదో వెళ్లి కొన్ని టెస్టులు చేసి వచ్చి మొత్తం పరిష్కరించామని చెప్పడం సరికాదు… ప్రజల సంతృప్తిపై ఆరా తీయాలి. ఆసుపత్రుల్లో చనిపోయిన వారి దేహాలను ఇంటికి చేర్చాలన్న ఉద్దేశంతో గతంలో మహాప్రస్థానం అంబులెన్స్ లను తీసుకొచ్చాం…వాటిని కూడా మరుగున పెట్టారు. అవసరాన్ని బట్టి అంబులెన్స్ ల వినియోగాన్ని పెంచాలి. ఆసుపత్రుల్లో రోగులకు అందించే బెడ్ షీట్లు కూడా నాణ్యత, శుభ్రంతో ఉండాలి.
ప్రజల్లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, వ్యాధిపై అవగాహన తీసుకురాగలిగితే మరణాలను తగ్గించవచ్చు. రాష్ట్రంలో జోన్ల వారీగా సర్వీస్ ప్రొవైడర్ మానిటర్ ఏర్పాటు చేసి ఆసుపత్రుల్లో చేసే శానిటేషన్ ను అబ్జర్వేషన్ చేయాలి. మెడ్ టెక్ జోన్ పట్ల గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. యేడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ మెడ్ టెక్ జోన్ ద్వారా జరుగుతోంది. తక్కువ ఖర్చుతో అన్ని రకాల మెడికల్ ఎక్విప్ మెంట్ ను అందిస్తోంది.
అయినా దీన్ని గత ప్రభుత్వం వినియోగించుకోలేదు.
నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం.వారికి ప్రభుత్వమే స్థలం అందిస్తుంది. ప్రభుత్వ, పీపీపీ ఆసుపత్రలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తాం. దేశంలోనే ఏపీ ఆసుపత్రుల పనితీరు బెస్ట్ గా ఉండాలి.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.