– ఆరు డెన్లకు భారతి సిమెంట్ నుంచే ముడుపులు?
– రాజ్ కసిరెడ్డి రీసోర్స్ వన్ కంపెనీలో కూడా సిట్ సోదాలు
– భారతీ సిమెంట్స్‌లో సిట్ సోదాలు
హైదరాబాద్ : ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు . హైదరాబాద్‌లో శనివారం పలు ప్రాంతాల్లో కీలక సోదాలు నిర్వహించారు. జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్‌లో సోదాలు ప్రారంభించారు. ఇప్పటికే అరెస్టు చేసిన బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్‌లో డైరెక్టర్‌గా ఉండటంతో, ఆ కంపెనీలో సోదాలు చేపట్టారు.
రాజ్ కసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీలో కూడా సిట్ సోదాలు చేశారు. ఇప్పటికే అరెస్టు అయిన చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టా రెంట్లో కూడా సోదాలు ప్రారంభించారు. కార్యాలయాల్లో సోదాలతో పాటు ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు? ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై సాంకేతిక ఆధారాలతో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
బంజారాహిల్స్ భారతి సిమెంట్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. భారతి సిమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్లని సిట్ అధికారులు పరిశీలించారు. ఆరుమందితో కూడిన సిట్ బృందం సోదాలు నిర్వహించారు. లిక్కర్ స్కాం భారతి సిమెంట్ కేంద్రంగా నడిచిందని అనుమానాలు రావడంతో, అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ.3500 కోట్ల స్కామ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఆరు డెన్లకు భారతి సిమెంట్ నుంచే ముడుపులు తరలించినట్లు గుర్తించారు.
భారతీ సిమెంట్‌లో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలరీల యజమానులతో సమావేశాలు నిర్వహించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ సమావేశాల అనంతరం ముడుపులను భారతీ సిమెంట్ కంపెనీలో అందజేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన సిట్‌కు కొన్ని కీలకమైన ఆధారాలు లభించినట్లు సమాచారం.