Suryaa.co.in

Telangana

అసైన్డ్ భూములు గుంజుకుంటే ఆందోళన తప్పదు

– అసైన్డ్ భూముల రియల్ వ్యాపారం ఆలోచన విరమించుకోండి
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు వ్యవసాయ భూములిస్తే వాటిని గుంజుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించడం దుర్మార్గమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం భూ పంపిణీ చేయకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను రియల్ వ్యాపారం కోసం రైతుల నుంచి బలవంతంగా గుంజుకునే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు.

రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమిని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రకాల పేదలకు పంపిణీ చేసిందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో కొండలు, గుట్టలు ఉంటే చదును చేసుకొని లబ్ధిదారులు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారని అన్నారు. భూమికి రైతుకు ఎడతెగని అనుబంధం ఉంటుందని, అలాంటి భూమిని ప్రభుత్వం బలవంతంగా గుంజుకొని ఎకరానికి 400 గజాల స్థలం ఇస్తామని అనడం సమంజసం కాదని అన్నారు.

నిరుపేదలకు ఉపాధి నిమిత్తం అప్పటి ప్రభుత్వాలు అసైన్మెంట్ కమిటీల ద్వారా ఐదు ఎకరాల లోపు భూములను పంచితే అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ముచ్చర్ల ఫార్మా హబ్, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల పేరిట ఇప్పటికే రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజు కోవడం వల్ల వారు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. లోటు ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం పేదల పట్ల మరీ నిరంకుశంగా, నిర్దయగా, అమానవీయంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు.

అసైన్డ్ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రజాగ్రహనికి గురికాక తప్పదన్నారు. ప్రజా సంక్షేమాన్ని మరిచి పేదల భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ప్రతిపాదనని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకుంటే పేదల పక్షాన యుద్ధం చేస్తామని వారి భూములు వారికి దక్కే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు. ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కానీ, ఏ వ్యాపారి కానీ ఆ భూములు కొంటే భవిష్యత్ లో నష్టపోతారని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని, ఆ భూములు తిరిగి పేదలకు ఇస్తామని అన్నారు.

LEAVE A RESPONSE