హైదరాబాద్ : ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై spdcl సిఎండి ముషారఫ్ ఫారుకి ద్వారా ఆరా తీశారు. ఈ ప్రమాదంలో అయిదుగురు మరణించడం, మరికొంతమంది గాయపడటం దురదృష్టకరమన్నారు.
ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సూచించారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సానుభూతి
రామంతపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనలో అయిదుగురు మరణించడం,మరికొంతమంది గాయపడ్డ విషయం తెలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చలించిపోయారు. అత్యంత విషాదఘటనగా పేర్కొంటూ తన బాధను వ్యక్తం చేశారు.