Suryaa.co.in

Telangana

భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమైనా బండి సంజయ్ ఒక్కడిదా?

-భాగ్యలక్ష్మి అమ్మవారిని అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆరాధిస్తాం
– కాంగ్రెస్ భావజాలాన్ని వ్యతిరేకించడమంటే.. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లే
– బండి సంజయ్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్

భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమైనా బండి సంజయ్ ఒక్కడిదా?.. అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు మతాలను రెచ్చగొట్టి తెలంగాణ లో రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని తాము కూడా ఆరాధిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌లో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని చెప్పారు. ఎవరో చేసిన పనికి పార్టీది బాధ్యత ఎలా అవుతుంది అని ప్రశ్నించారు. హిందూత్వం బండి సంజయ్ సొత్తు కాదని, మతాలు, నమ్మకాలు వ్యక్తిగతమన్నారు. రాజకీయాల్లోకి మతాన్ని లాగి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మెంటల్ గా మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు.

భారత కాంగ్రెస్ భావజాలాన్ని వ్యతిరేకించడం అంటే.. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని, భారత రాజ్యాంగాన్ని గౌరవించని వారు ప్రజా ప్రతినిధిగా కొనసాగడానికి అనర్హులని బండి సంజయ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొంది అధికారంలోకి రావాలన్న బిజెపి చేస్తున్న దురాలోచన లో భాగంగానే బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ మధ్యయుగ కాలం నాటి పరిస్థితులను సృష్టిస్తున్న బండి సంజయ్ కి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు చేసిన పాపాల్లో టీఆర్ఎస్ భాగస్వామ్యం కూడా ఉందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో కలిపినప్పుడు… అఖిల పక్షాన్నీ ఎందుకు ఢిల్లీకి తీసుకు వెళ్లలేదని సీఎం కేసీఆర్ ను భట్టి ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల తర్వాత మొసలి కన్నీరు కార్చడం సరైంది కాదని అన్నారు.

గన్ పార్క్ వద్ద అమరుల స్థూపానికి నివాళులు అర్పించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
రాష్ట్ర ఏర్పాటులో ఎన్ని అవరోధాలు వచ్చిన కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ వస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని, సామజిక తెలంగాణ ఏర్పడుతదని అందరు ఆశించారు. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్న తెలంగాణ ప్రజల ఆశయాలు ఏ మాత్రం సాకారం కాలేదు.మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్ర సాధన లక్ష్యాలు సాధ్యం.

LEAVE A RESPONSE