భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్
2000 నుంచి పెండింగ్‌లో ఉన్న తుంగలాం సమస్య పరిష్కారం కొరకు బీహెచ్‌ఈఎల్ కొత్త చైర్మన్‌ను ఢిల్లీలో కలిసిన బీజేపీ ఎంపీ జీవీఎల్
తుంగలాం సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేసిన ఎంపీ జీవీఎల్
ఇది తుంగలాం ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్న జీవీఎల్
విశాఖపట్నం గాజువాక అసెంబ్లీలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తుంగలాం ప్రజల సమస్యను పరిష్కరించడానికి, బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు బిహెచ్‌ఇఎల్ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె. సదాశివ మూర్తి ని కలిసి తుంగలాం, చుక్కవానిపాలెం, జగ్గరాజుపేట, పకీర్ టక్యా, సిద్ధార్థనగర్‌కు చెందిన ప్రజల సౌకర్యార్థం గ్రామం వైపు బిహెచ్‌ఇఎల్-హెచ్‌పివిపి గేట్ తెరవడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
2000 సంవత్సరం నుంచి జాతీయ రహదారి (NH-16) మరియు గాజువాక ప్రాంతానికి వెళ్లే రహదారిపైకి పై గ్రామాల ప్రజలకు వాహనాల రాకపోకలను నిరాకరిస్తున్నారని బీహెచ్‌ఈఎల్ చైర్మన్‌కు సమర్పించిన లేఖలో ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ గ్రామాల నుంచి అంబులెన్స్‌లు, స్కూల్ ఆటోలు, ఇతర వాహనాలను అనుమతించడం లేదని ఎంపీ జీవీఎల్ తెలిపారు.
తాను ఇటీవల తుంగలాం ప్రాంతాన్ని, హెచ్‌పివిపి ప్లాంట్‌ను స్వయంగా సందర్శించానని పేర్కొన్న ఎంపి జివిఎల్ నరసింహారావు ప్రధాన గేటును మూసివేయడానికి ఉదహరించిన కారణాలు అభ్యంతరకరమైనవన్నారు. “ఎన్‌హెచ్ 16 మరియు గాజువాక నుండి సాధారణ ప్రజలకు బ్యాంకు, పోస్టాఫీసు మరియు పాఠశాల వంటి పబ్లిక్ సౌకర్యాలకు 24×7 యాక్సెస్ ఉండగా, ప్లాంట్ కోసం భూములను (393 ఎకరాలు) ఇచ్చిన తుంగలాం ప్రజలకు జాతీయ భద్రత అని చెప్పి ప్రవేశాన్ని ఆపేయడం చాలా బాధాకరం, గ్రామస్తుల పట్ల నిర్లక్ష్యభావం తెలియపరుస్తోందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం తుంగలాం తదితర గ్రామాల ప్రజలు తనను సంప్రదించారని, జిల్లా కోర్టులో BHEL-HPVP కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని విశాఖపట్నంలోని బీహెచ్‌ఈఎల్-హెచ్‌పీవీపీ యూనిట్‌కు తుంగళం ప్రధాన గేటును తేరిచెందుకు ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు బీహెచ్‌ఈఎల్ చైర్మన్‌ను కోరారు.
సమావేశానంతరం బీహెచ్‌ఈఎల్ చైర్మన్ సానుకూలంగా స్పందించడం పట్ల ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై వెంటనే ఉన్నతాధికారుల నుంచి నివేదిక ఇవ్వాలని కోరారని తెలిపారు.
ప్రధాన గేటును తెరవడం తుంగలాం ప్రజల సౌకర్యార్థం మాత్రమే కాకుండా తుంగలాం మరియు పొరుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తానని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.