“మనలోమాట”ఆవిష్కరణలో వక్తలు !
ఏప్రిల్ 2…
ఆదివారం సాయంత్రం …
5 గంటల ప్రాంతం…
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం…
మోరంపూడి జంక్షన్..
శుభమస్తు మినీ కళ్యాణ మంటపం..
మబ్బులు కమ్మిన ఆకాశం…
చిరుజల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది!
సీనియర్ పాత్రికేయులతో హాలు నిండిపోయి పెళ్ళిఇల్లు మాదిరి కళకళ లాడుతోంది !
ఉభయగోదావరి జిల్లాల రాజకీయ సామాజిక ప్రముఖులు చాలామంది హాజరయ్యారు!
చాలాకాలం తర్వాత కలుసుకున్న మిత్రుల పలకరింపులు , పరిహసాలు , హాస్యాలు , వెటకారాలు!
గోదావరివాసుల అచ్చమైన ఆత్మీయ సమ్మేళనం అని చెప్పాలి!
సందర్భం —
సీనియర్ పాత్రికేయుడు భోగాది వెంకటరాయుడు గారు రచించిన “మనలోమాట” పుస్తకావిష్కరణ కార్యక్రమం అది! యాభై ఏళ్ల పాత్రికేయజీవితంలో రాయుడుగారు ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా పనిచేశారు !ఏ.పి.యు.డబ్ల్యూ.జే. సంస్థకు రెండు జిల్లాలలోనూ సారథ్యం వహించారు! అందుకే రాయుడుగారు తన పుస్తకావిష్కరణ కార్యక్రమం రాజమండ్రిలో జరగాలని గట్టిగా కోరుకున్నారు ! మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చొరవ తీసుకుని రాజమండ్రి ప్రెస్ క్లబ్ మిత్రులతో మాట్లాడి ఏర్పాట్లు చూసారు!సభకు ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు! ,సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ , ఆంధ్రజ్యోతి సంపాదకులు కే.శ్రీనివాస్ ముఖ్య అతిధులుగా హాజరై పుస్తకాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు! గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పూర్వపుచైర్మన్ , సాక్షి సాయంకాల దినపత్రిక అధినేత గన్ని కృష్ణ , ఐ.జే.యు. జాతీయకార్యదర్శి డి.సోమసుందర్ , సీనియర్ పాత్రికేయుడు విక్రమ్ పూల, ఆత్మీయ అతిధులుగా హాజరయ్యారు! నెల్లూరు నుండి చిరకాలంగా వెలువడుతున్న “లాయర్” వారపత్రికలో గత రెండేళ్ళుగా సమకాలీన రాజకీయ పరిణామాలపై భోగాది వెంకటరాయుడు గారు తనదైన వ్యంగ్య శైలిలో “మనలో మాట” కాలమ్ కథనాలు రాస్తూ వచ్చారు! అవి పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి!
వాటినే తాజాగా “మనలో మాట” పుస్తకరూపంలో తెచ్చారు! “స్వతంత్ర పాత్రికేయత కనుమరుగై పోతున్న ప్రస్తుతతరుణంలో తనదైన సొంతగొంతుతో సమకాలీన రాజకీయ అంశాలపై , నిష్పాక్షికంగా , ముక్కుసూటిగా , నిర్భయంగా వ్యంగ్యంగా రాసిన భోగాది వెంకటరాయుడు గారి రచనాశైలిని అభినందిస్తూ” వక్తలు ప్రసంగించారు!
ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఒకప్పటి పాత్రికేయంలో ఉన్నవిలువలు , ప్రమాణాలు ఇప్పుడు లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు!కేవలం డెబ్బైఏళ్ళవ్యవధిలో మనసమాజంలో పరిస్థితులు ఇంతగా మారిపోవడానికి కారణాలు ఏమిటో అర్థంకావడం లేదన్నారు!అయితే పరిస్థితులు తప్పనిసరిగా మారతాయనే విశ్వాసం తనకుందని అరుణ్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు! వై.ఎస్. హయాంలో నిర్వహించిన జలయజ్ఞంపై రాయుడుగారు రచించిన పుస్తకం తమకు ఎప్పుడూ ఒక రిఫరెన్స్ గా ఉపయోగపడుతుందని అన్నారు!”మనలో మాట” లో కథనాలను , వ్యాఖ్యలను అరుణ్ కుమార్ ప్రస్తావిస్తూ ఇటువంటివి చదివినప్పుడు ఇంకా స్వతంత్రస్వరాలు ఉన్నాయన్న విశ్వాసం కలుగుతోందని అన్నారు!
ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే.శ్రీనివాస్ మాట్లాడుతూ తాను ట్రైనీ సబ్ ఎడిటర్ గా చేరేనాటికే రాయుడుగారు ఉదయంలో బైలైన్ వార్తాకథనాలు ఉధృతంగా రాస్తున్నారని అన్నారుఉదయం పత్రిక ఆరోజుల్లో ఒక ఉద్యమంగా నడిచేదని శ్రీనివాస్ గుర్తు చేశారు! రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర రాజకీయనాయకత్వం , పౌరసమాజం ఆంధ్రప్రాంతపు అభివృద్ధికి అవసరమైన అంశాలపై దృష్టిపెట్టని రోజుల్లో రాయుడుగారు, దూరదృష్టితో రాష్ట్ర సమగ్రాభివృద్ధికోసం రాసిన కథనాలు ఎంతో విలువైనవని శ్రీనివాస్ అన్నారు! తానుకూడా ఆంధ్రజ్యోతిలో వీక్లీ కాలమ్ రాస్తుంటానని , రాయుడుగారు లాయర్ వారపత్రికలో “మనలో మాట” కాలమ్ లో రాసిన కొన్నిఅంశాలను చూసి తనరాతలను పోల్చుకుంటూ ఉంటానని శ్రీనివాస్ అన్నారు! అభిప్రాయాల సారూప్యం లేకుండా కేవలం శైలిని చూసి అభిమానించడం అనేది ఉండదని అన్నారు! తమ ఇద్దరిఆలోచనా సరళి ఒకేరకంగా ఉండటం కనిపిస్తుందని శ్రీనివాస్ అన్నారు!
సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాయుడుగారు లాంటి పాత్రికేయులు అరుదుగా ఉంటున్నారని , అటువంటి స్వతంత్ర నిష్పాక్షిక స్వరాల అవసరం సమాజానికి ఎంతైనా ఉందని అన్నారు!
ఐ.జే.యు. జాతీయకార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడుతూ కవులు , రచయితలు, జర్నలిస్టులు నిరంతరం ప్రజలతరపున ప్రతిపక్షపాత్ర పోషిస్తారని , రాయుడుగారు కూడా ధిక్కారస్వరంతో తన అభిప్రాయాలని ముక్కుసూటిగా నిర్భయంగా వ్యంగ్యంగా చెబుతారని అన్నారు!అధికారపక్షానికి మాత్రమే కాకుండా ప్రతిపక్షానికి కూడా రాయుడు గారు ప్రతిపక్షంగా వ్వ్యవహరిస్తారని అన్నారు!మన రాష్ట్ర రాజకీయాలే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాల , జాతీయ పరిణామాలు కూడా ఆయన దృష్టిని దాటిపోవని అన్నారు!తన దృష్టికి వచ్చిన ఏ అంశంపైనైనా నిర్మొహమాటంగా తనఅభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం ఆయనకు అలవాటని చెప్పారు! అనివార్య కారణాల వల్ల ఐజేయు జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని వారితరపున రాయుడు గారికి శుభాకాంక్షలు అందచేయమన్నారని సోమసుందర్ తెలిపారు!
సీనియర్ పాత్రికేయుడు విక్రమ్ పూల మాట్లాడుతూ.. రాయుడు గారితో కలిసి పనిచేయడం ఒక అద్భుత అనుభవం అని , ఆయన రచనలు నేటితరం జర్నలిస్టులకు వృత్తి నిర్వహణలో దారిచూపుతాయని అన్నారు!
భోగాది వెంకటరాయుడు మాట్లాడుతూ “జలయజ్ఞం” ప్రాజెక్టులపై తానుపుస్తకం రాయడానికి దారితీసిన పరిస్థితులను విపులంగా వివరించారు! వై.ఎస్. గారే స్వయంగా ఆ పుస్తకాన్ని జూబిలీహాలులో ప్రభుత్వం తరపున ఆవిష్కరించడంతో, రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో ఆవిష్కరణ చేయించాలనుకున్న తన కోరిక నెరవేరలేదని తెలిపారు! తాను ఎక్కువకాలం ఉద్యోగంచేసిన కాకినాడ కంటే రాజమండ్రిలోనే తనకు స్నేహితులు ఎక్కువన్నారు! అందుకే ఉండవల్లి సారథ్యంలోనే “మనలో మాట” ఆవిష్కరణ కార్యక్రమం జరగాలని కోరుకున్నానని రాయుడు తెలిపారు!వి లక్ష్మీనారాయణ గారు , కే.శ్రీనివాస్ గారు హాజరై పుస్తకాన్ని సంయుక్తంగా ఆవిష్కరించడం తనకు గర్వకారణమని ధన్యవాదాలు తెలిపారు!”తనకు చెవుడు ఉండటం వల్ల వక్తలు తనగురించి మాట్లాడిన సంగతులు ఏవీ వినపడలేదని” రాయుడు చమత్కరించారు ! ముఖ్యఅతిథులను రాజమండ్రి ప్రెస్ క్లబ్ తరపున ఉండవల్లి అరుణ్ కుమార్ సత్కరించారు! రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రచయిత భోగాది వెంకటరాయుడును , అతిథులను సత్కరించారు!రాయుడుగారిని పలువురు మిత్రులు పూలమాలలతో , శాలువాలతో ఘనంగా సన్మానించారు!సీనియర్ పాత్రికేయుడు వైవిఎస్ కృష్ణకుమార్ స్వాగతం పలికి సభా సంచాలనం చేశారు!ఏ.పి.యు.డబ్ల్యూ.జే. రాష్ట్రకార్యదర్శి మండేల శ్రీరామ్మూర్తి వందనసమర్పణ చేశారు!
మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు , సామాజికకార్యకర్త యమునా పాఠక్, రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి సారథి, సీనియర్ పాత్రికేయులు పెద్ధాడ నవీన్ , యు. సూర్యచంద్రరావు (వి – రాగి ) ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్ ఇన్ ఛార్జ్ బి.హెచ్.వి. మంగేష్, బ్రాంచ్ మేనేజర్ ఎస్. శ్రీనివాస్ , సీనియర్ పాత్రికేయులు ఎ.ఆర్.వి. సత్యనారాయణ , ఎన్ క్యూబ్ , మేడపాటి శ్రీనివాసరెడ్డి , కొండ్రెడ్డి శ్రీనివాస్ , గుండా రామకృష్ణ, చిర్ల రాజేంద్రప్రసాదరెడ్డి , తదితరులు పాల్గొన్నారు!
డి.సోమసుందర్
సీనియర్ పాత్రికేయుడు