Suryaa.co.in

Editorial

సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ‘సార్లు’

– ఎన్నికల బరిలో ఆంధ్రా-తెలంగాణ అధికారులు
– పోటీ చేసేందుకు ఐఏఎస్‌, ఐపిఎస్‌, ఐడిఈఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారుల ఆసక్తి
– అమలాపురం నుంచి వైసీపీ టికెట్‌ కోసం సీనియర్‌ ఐపిఎస్‌ ప్రయత్నాలు
– కర్నూలు లేదా నంద్యాల నుంచి టీటీడీ కీలక అధికారి రె‘ఢీ’
– కనిగిరి వైసీపీ బరిలో మరో ఐపిఎస్‌?
– గత ంలోనే ప్రయత్నించి విఫలం
– ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్న ఏపీ అధికారులు
– ఈసారి ఆశావహుల్లో ఎక్కువమంది ఐఆర్‌ఎస్‌లే
– తెలంగాణ నుంచి కర్ణన్‌, గడల శ్రీనివాస్‌, శ్యాంనాయక్‌, పాండురంగ నాయక్‌, ఆకునూరి మురళీ పేర్లు?
– కొందరు టీఆర్‌ఎస్‌, మరికొందరు కాంగ్రెస్‌ నుంచి పోటీకి సిద్ధం?
-తెరపైకి కేరళ క్యాడర్‌ ఐపిఎస్‌, మధ్యప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారుల పేర్లు
– ఎమ్మెల్యే టికెట్‌ కోరుతున్న మాజీ ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న ఎన్నికల బరిలో అధికారులు ప్రజాప్రతినిధుల అవతారమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌-ఐపిఎస్‌ అధికారులు రాజకీయ తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సదరు అధికారులిద్దరూ అధికార వైసీపీ నుంచి తమ అదృష్టం పరీక్షించుకోనున్నట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణలోనూ పలువురు ఐఏఎస్‌-ఐపిఎస్‌ అధికారులు వచ్చే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట.

టీటీడీలో కీలక హోదాలో ఉన్న ఓ ఆలిండియా సర్వీసు అధికారి, వచ్చే ఎన్నికల్లో నంద్యాల లేదా కర్నూలు లోక్‌సభ నుంచి పోటీ చేయాలని ఉత్సాహపడుతున్నారట. ఆ మేరకు వైసీపీ నాయకత్వం కూడా ఆయనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కర్నూలు నుంచి పోటీ చేసేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. కర్నాటకలో ఉన్న ఆయన బంధువు సహాయ సహకారాలతో ఆ టీటీడీ అధికారి, ఎన్నికల బరిలో దిగాలని ప్రయత్నిస్తున్నారట.

ఇక గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పోటీ చేసేందుకు, చివరివరకూ ప్రయత్నించి విఫలమయిన ఓ ఐఏఎస్‌ కూడా, ఈసారి టికెట్‌ సాధించేందుకు రంగంలోకి దిగారట. కడప జిల్లాకు చెందిన వైసీపీ కీలకనేత అల్లుడైన ఆ ఐపిఎస్‌ అధికారి, గత ఎన్నికల ముందు తన పదవికి రాజీనామా చేసి, కనిగిరి నుంచి పోటీ చేద్దామని తీవ్రస్థాయిలో కృషి చేశారు. ఆ సందర్భంలో ఆయన జైలు ఓ ఉన్న జగన్‌ను సైతం కలిశారన్న ప్రచారం జరిగింది. అప్పట్లో ఆయన వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ప్రశాంత్‌కిశోర్‌ టీమ్‌ సూచనలతో, ఆయనకు టికెట్‌ దక్కకుండా పోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి డెప్యుటేషన్‌ మీద వచ్చిన ఆ ఐపిఎస్‌, మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రధానంగా ఏపీ కేడర్‌కే చెందిన ఓ సీనియర్‌ దళిత ఐపిఎస్‌ అధికారి కూడా.. కుదిరితే అమలాపురం లోక్‌సభ, లేదా అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే వివాదాస్పద అధికారిగా ప్రచారంలో ఉన్న ఆయనపై.. విపక్షమైన టీడీపీ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిఓపీటీతోపాటు, కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్‌ సంపాదించుకునేందుకే సదరు ఐపిఎస్‌ అధికారి.. తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నందున, అతనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఈపాటికే ఫిర్యాదు చేశారు. దళితులలో కొంత ఇమేజ్‌, సొంత యంత్రాంగం ఉన్న ఆ ఐపిఎస్‌ అధికారికి, వచ్చే ఎన్నికల్లో టికెట్‌ దక్కినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

gadala-srinivasraokarnanఇక తెలంగాణ లోనూ పలువురు అధికారులు.. వచ్చే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు, జోరుగా చర్చ జరుగుతోంది. అయితే వీరిలో ఎక్కువమంది టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకే ఆసక్తిచూపిస్తుండటం విశేషం. హెల్త్‌ డైరక్టర్‌ డాక్టర్‌ గడల శ్రీనివాస్‌, ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ మాజీ కలెక్టర్‌ కర్ణన్‌, ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారన్నది మరో ప్రచారం.

venkatramireddyఇటీవలే ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న మాజీ ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారట. ఇక కేరళ క్యాడర్‌కు చెందిన ఐపిఎస్‌ లక్ష్మణ్‌, వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారట. ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్త, జగిత్యాల ఆర్టీఓ శ్యాంనాయక్‌ ఈసారి తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌లో ఒక స్థానం ఆశిస్తున్నారు.

AKUNURI-MURALIchandravaadanహైదరాబాద్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జాయింట్‌ డైరక్టర్‌గా ఉన్న పాండురంగ నాయక్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక టీఆర్‌ఎస్‌ సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేసి, తన పదవికి రాజీనామా చేసిన మాజీ ఐఏఎస్‌ ఆకనూరి మురళి కూడా, ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. దానికోసమే ఆయన తన ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా కూడా చేశారు. మాజీ ఐఏఎస్‌ ఆర్‌.వి. చంద్రవదన్‌, బీజేపీ నుంచి సీటు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

LEAVE A RESPONSE