– కాంగ్రెస్ కూటమికి దారుణ విషాదం
– పనిచేయని రాహుల్ ప్రచారం
– కాంగ్రెస్‌తో జతకట్టి నష్టపోయిన ఆర్జేడీ
– మళ్లీ నితీష్‌కే బీహార్ పట్టం
– మహాగఠబంధన్‌కు మహా విషాదం
ఎన్డీయే కూటమి జైత్రయాత్ర ముందు కాంగ్రెస్ కూటమి కకావికలయింది. కాంగ్రెస్‌తో జత కట్టిన ఆర్జెడి కూలిపోయింది. కాంగ్రెస్- దాన్ని నమ్ముకున్న ఆర్జేడీ అభ్యర్ధులు దారుణ పరాజయం పాలయ్యారు. అయితే మజ్లిస్ పార్టీ బీహార్‌లో 5 స్థానాలు గెలవడం విశేషం. బీహారీలు మోదీ పాలనకు మరోసారి జైకొట్టడంతో, నితీష్‌కుమార్ రెండోసారి సీఎం అయేందుకు మార్గం సుగమమయింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 203 సీట్లను కైవసం చేసుకున్న ఎన్డీయే రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాల్లో గెలుపొందగా, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 85 సీట్లతో అద్భుతమైన విజయం నమోదు చేసుకుంది. 2020 ఎన్నికల్లో కేవలం 43 సీట్లు మాత్రమే గెలిచిన జేడీయూ, ఈసారి రెట్టింపు స్థానాలు దక్కించుకోవడం విశేషం. కూటమిలోని ఇతర పక్షాలైన ఎల్జేపీ (ఆర్వీ) 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 స్థానాల్లో విజయం సాధించాయి.
ప్రతిపక్ష మహాగఠబంధన్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2020లో 110 సీట్లు గెలుచుకున్న ఈ కూటమి, ఈసారి కేవలం 34 స్థానాలకే పరిమితమైంది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 75 సీట్ల నుంచి 25 స్థానాలకు పడిపోగా, కాంగ్రెస్ పార్టీ 19 నుంచి 6 సీట్లకు దిగజారింది. వామపక్షాలు 3 సీట్లకే సరిపెట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టినందుకు ఆర్జేడీ దారుణ మూల్యం చెల్లించుకుంది. అధిక ఓట్ల శాతం సాధించినప్పటికీ ఆర్జేడీ చతికిలపడటం, కాంగ్రెస్ పుణ్యమేనని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రాహుల్‌గాంధీ ప్రచారం మహాగఠబంధన్‌కు కలసిరాకపోగా నష్టం చేకూర్చింది. ఏతావతా బీహార్ ఎన్నికల విజయంతో మోదీ మరోసారి మహా నాయకుడిగా అవతరించారు.