Suryaa.co.in

Andhra Pradesh

చేనేత ఉత్పత్తుల అమ్మకాలకు బిర్లా గ్రూపు ‘ఆద్యం’ సహకారం

• రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
• నేడు(గురువారం) ఒప్పందంలోని అంశాలపై చర్చ
• ‘ఆద్యం’ రాకతో చేనేత వస్త్రాల విక్రయాలకు పెరగనున్న మార్కెట్
• నేతన్నలకు ఏడాది పొడువునా ఉపాధి : మంత్రి సవిత

అమరావతి : చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనిలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ‘ఆద్యం’ హ్యాండ్-వోవెన్ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.

రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయన్నారు. వాటిలో ఉప్పాడ జమధాని చీరలు, మంగళగిరి చీరలు, వెంకటగిరి చీరలు, ధర్మవరం సిల్క్ చీరలు, పావడాలు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (G.I) హోదాను కలిగి ఉన్నాయన్నారు. ఈ వస్త్రలకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కలిగించడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కార్యాచరణ ప్రారంభించారన్నారు.

దీనిలో భాగంగా రాష్ట్ర ఉత్పత్తులైన ఉప్పాడ-కాటన్ జమధాని, పులగుర్త-మల్కా ఖాదీ, అంగర-కాటన్ చీరలు, వెంకటగిరి-కాటన్ చీరలు, కోడుమూరు గద్వాల్ – కాటన్ చీరలకు ఆద్యం హ్యాండ్-వోవెన్ సంస్థతో కలిసి మార్కెటింగ్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఉన్న ఆద్యం సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధి మనీష్ సక్సేనాతో కలిసి ఒప్పందంలోని అంశాలను గురువారం ఖరారు చేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ రేఖారాణిని ఆదేశించినట్లు తెలిపారు.

ఆద్యం సంస్థ ఇప్పటికే దేశంలో వారణాసి, పోచంపల్లి, భుజ్ ప్రాంతాలకు చెందిన చేనేత సంఘాలతో పనిచేస్తోందన్నారు. ఏపీకి చెందిన చేనేత వస్త్రాల మార్కెటింగ్ పై ఆ సంస్థతో ఒప్పందం ఖారారైతే నేతన్నలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. స్వయంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాల విక్రయాలకు మార్కెట్ సదుపాయం కలుగుతుందన్నారు. దీనివల్ల చేనేత పురాతన డిజైన్లను ఆద్యం సంస్థ భద్రపరచడంతో పాటు ఏపీ చేనేత కార్మికులకు ఏడాది పాటున ఉపాధి లభించి, ఆర్థిక భరోసా కలుగుతుందని మంత్రి సవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

గడిచిన అయిదేళ్లలో అన్ని రంగాలతో పాటు చేనేత రంగం కూడా నిర్వీర్యమైందన్నారు. అప్పటి ప్రభుత్వ నుంచి ఏవిధమైన భరోసా లభించకపోవడం, పెట్టుబడులు పెరగడం, వస్త్రాలకు మార్కెట్ సదుపాయం లేకపోవడం, చేసిన అప్పులు తీర్చేమార్గం లేకపోవడం వంటి కారణాలతో ఎందరో చేనేత కార్మికులు బలవర్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో మరోసారి సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి రావడంతో, చేనేత పరిశ్రమకు మంచిరోజులు వచ్చాయన్నారు.

2014-19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమలుచేసిన అన్ని పథకాలను కూడా అమలు చేయనున్నామని తెలిపారు. అదే సమయంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపునకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. నేతన్నలు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆ ప్రకటనలో తెలిపారు.

LEAVE A RESPONSE