– తెలంగాణ పార్టీ ఆఫీసులో ఘనంగా వాజపేయి శతజయంతి వేడుక
– ర్యాలీ, రక్తదానశిబిరం, సభతో కమలంలో జోష్
-విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో కనిపించని వాజపేయి శత జయంతి సంబరాలు
– డివిజన్ స్థాయి నాయకులతో కానిచ్చేసిన కమలదళం
– ఎమ్మెల్యే సుజనా నగరంలోనే ఉన్నా ఆయనతో కార్యక్రమం నిర్వహించలేని నాయకత్వం
– తన నియోజకవర్గంలోనే రెండు కార్యక్రమాలు నిర్వహించుకున్న సుజనా
– పార్టీలో చేరికల కోసం రాజమండ్రి వెళ్లిన అధ్యక్షురాలు పురందీశ్వరి
– ఆ కార్యక్రమం విజయవాడలోనే ఎందుకు జరపలేదన్న నేతల ప్రశ్నలు
– విశాఖ సభకు వెళ్లిన సంఘటనా మంత్రి మధుకర్‌జీ
– ప్రముఖులతో వాజపేయి శత జయంతి వేడుక నిర్వహించలేని బీజేపీ నాయకత్వం
– నాగభూషణం సహా హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లిన ఏపీ బీజేపీ నేతలు
– బయటపడ్డ సమన్వయలోపం
– దిశానిర్దేశం లేని నాయకత్వంపై సీనియర్ల రుసరుసలు
-వాజపేయిని అనాధను చేశారన్న ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకనేత అటల్ బిహారీ శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. దేశంకోసం ఆయన చేసిన నిస్వార్ధ సేవలు స్మరిస్తూ, ప్రధాని మోదీ నుంచి.. రాష్టాలలో ఎమ్మెల్యేల వరకూ నివాళులు అర్పించారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, విద్యార్ధులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు విస్తృతస్థాయిలో నిర్వహించారు.
దేశంలోని అన్ని రాష్ట్ర బీజేపీ కార్యాలయాల్లో అటల్‌జీ సేవలు స్మరించుకుంటూ, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాటికి ఆయా రాష్ట్ర, కేంద్ర ప్రముఖులు హాజరయి కార్యకర్తల్లో స్పూర్తి నింపారు. హైదరాబాద్‌లో అయితే అటల్జీ కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించి, కార్యకర్తల్లో కదనోత్సాహం నింపారు.
ప్రధానంగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ దళపతి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరయ్యారు. పార్టీ జెండాతో అఔగనేతలు పార్టీ ఆఫీసు వరకూ ర్యాలీగా వెళ్లగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముందుభాగాన ఉండి నడిపించిన ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
ఆ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో భారీసంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేశారు. తర్వాత కేంద్రమాజీ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ హాజరైన వాజపేయి సంస్మరణ సభకు వందలామంది కార్యకర్తలు హాజరయ్యారు. కిషర్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్,ఈటలరాజేందర్ వంటి అగ్రనేతల ఉపన్యాసాలు కమలదళాలకు స్ఫూర్తినిచ్చాయి.
అయితే దేశంలోని అన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయాలలో అటల్‌జీ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తే.. ఏపీలో మాత్రం అటల్‌బిహారీ వాజేపేయి అనాధగా మిగిలారు. డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలతో ఆయన పటానికి దీపం వెలిగించి.. ‘‘వాజపేయి శతజయంతి ఉత్సవం’’ అనే కార్యక్రమాన్ని మొక్కుబడిగా ముగించడం, సీనియర్ల ఆగ్రహానికి కారణమయింది.
నిజానికి అటల్జీ శతజయంతి కార్యక్రమాల షెడ్యూల్‌ను, జాతీయ పార్టీ నాయకత్వం ఏనాడో రాష్ర్ట పార్టీ కార్యాలయాలకు పంపింది. అంటే ఆరోజున కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నది ఆ సందేశ సారాంశం. మరి ఏపీ రాష్ట్ర నాయకత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం సీనియర్ల అసంతృప్తికి కారణమయింది. వాజపేయి శతజయంతి కార్యక్రమం గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, ఆ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రముఖులతో కార్యక్రమం రూపొందించుకోలేదంటే.. వాజపేయిపై పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఎంత చిత్తశుధ్ధి ఉందో అర్ధమవుతోందని సీనియర్లు మండిపడుతున్నారు.
అయితే మండల స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటుచేసుకోవాలని సందేశం పంపించారని, అందులో భాగంగా విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయ పరిథిలోని డివిజన్ నాయకులు, అక్కడ అటల్జీ కార్యక్రమం నిర్వహించారని పార్టీ నేతలు చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని అటల్జీని ఒక డివిజన్‌కు పరిమితం చేసి, ఆయన పరువుతీశారని ఓ నాయకుడు మండిపడ్డారు. మండల స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటుచేసినప్పటికీ, రాష్ర్ట కార్యాలయంలో భారీ స్థాయిలో అటల్జీ కార్యక్రమం ఎందుకు ఏర్పాటుచేయలేకపోయారని సీనియర్లు నిలదీస్తున్నారు.
రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి తన రాజమండ్రి నియోజకవర్గంలో కార్యక్రమం ఏర్పాటుచేసుకున్నారు. ఆ వేదికపైనే విశాఖ డైరీ చైర్మన్, ఆయన సోదరిని బీజేపీలో చేర్చుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే ఆ కార్యక్రమమేదో.. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే ఏర్పాటుచేసుకోవచ్చు కదా అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పోనీ అధ్యక్షురాలు రాలేని పక్షంలో, 8 మంది ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపి సీఎం రమేష్‌లో ఒకరితో పార్టీ ఆఫీసులో.. అటల్జీ శతజయంతి కార్యక్రమం నిర్వహించాలన్న ఆలోచన రా పోవడమే వింతగా ఉందని, సీనియర్లు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో అటల్జీ భారీ కార్యక్రమం నిర్వహించడం లేదని తెలియడంతో.. బీజేపీ రాష్ట్ర అధికార ముఖ్య ప్రతినిధి పాతూరి నాగభూషణం సహా పలువురు నాయకులు, హైదరాబాద్‌లో నిర్వహించిన అటల్జీ కార్యక్రమానికి హాజరవడం కొసమెరుపు.
అధ్యక్షురాలు లేకపోతే కార్యక్రమాలు నిర్వహించరా?
‘‘ అటల్జీ కార్యక్రమాన్ని విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి తన నియోజకవర్గంలో నిర్వహించారు. ఆ సందర్భంగా అటల్జీ విగ్రహావిష్కరణ, గ్రంధాలయంలో ఆయనకు నివాళులర్పించే కార్యక్రమం చేపట్టారు. సుజనా నగరంలో అందుబాటులోనే ఉన్నప్పుడు, ఆయనతో రాష్ట్ర కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించవచ్చు కదా? పోనీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అదే జిల్లాలో ఉన్నారు కదా? ఆయనతో అయినా కార్యక్రమం నిర్విహ ంచాల్సింది. మంత్రి సత్యకుమార్ యాదవ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అందుబాటులోనే ఉన్నందున వారికయినా ముందస్తు సమాచారం ఇచ్చి, వారితో అటల్జీ కార్యక్రమం నిర్వహించాలన్న ముందుచూపు లేకపోవడమే ఆశ్చర్యం. దీన్నిబట్టి మిగిలిన పార్టీ ప్రముఖులెవరూ, రాష్ట్ర కార్యాలయంలో కార్యక్రమాలు నిర్వహించకూడదన్న నాయకత్వ భావన అర్ధమవుతోంది. మొత్తానికి అందరూ కలసి అటల్జీని అనాధను చేశార’’ని తూర్పు గోదావరికి చెందిన ఓ పార్టీ ప్రముఖుడు ఆవేదన వ్యక్తం చేశారు.