Suryaa.co.in

Telangana

బీజేపీ బ్రాండ్ అంబాసిడర్… రాజగోపాల్ రెడ్డి

-టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ విమర్శ

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేలా మాట్లాడటాన్ని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రెండూ ప్రజావ్యతిరేక ప్రభుత్వాలే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని, ఒకవైపు గ్యాస్, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని చవిచూస్తుంటే… రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వత్తాసు పలకడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.

‘‘ 2009లో అమెరికా నుంచి వచ్చిన నీకు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అవకాశాలు కల్పిస్తే పదవులు అనుభవించి ఈ రోజు నిస్సిగ్గుగా కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేయాలనుకోవడం సరికాదు. నీవు కాంగ్రెస్ ఎమ్మెల్యేవా? బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ వా తేల్చుకో.. నీవు కాదు కదా, ఇంకెంతమంది వచ్చినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం కల అని గుర్తుంచుకో, ఈరోజు అన్నిపార్టీల నుంచి ఓడిపోయినోళ్లు, బ్యాంకులను ముంచినోళ్లే బీజేపీలో చేరుతున్నారనేది నగ్నసత్యం కాదా? ’’ అని బండి సుధాకర్ ప్రశ్నించారు.

ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, అగ్రనేతలు.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణలతో కక్ష సాధిస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిశానని చెప్పడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమన్నారు.

కాంగ్రెస్ లో ఎన్నోఏళ్లుగా క్రమశిక్షణ కలిగిన ఎందరో కార్యకర్తలు ఎలాంటి పదవులు లేకున్నా పార్టీ కోసం అహర్నిశలూ పని చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని.. రాజగోపాల్ రెడ్డి లాంటి వారు మాత్రం అన్నిరకాలుగా లబ్ధిపొందుతూ విశ్వాస ఘాతకులుగా తయారయ్యారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోవర్టులను గుర్తించి ఏరిపారేయాలని, పార్టిని మరింత పటిష్టపరుచుకోవాలని బండి సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE