– సీఎం కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ లేఖ
హైదరాబాద్‌లో ఒక మైనర్‌బాలికపై జరిపిన అత్యాచారం కేసులో నిందితెలెవరన్నది తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆమేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..
గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి,
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
నమస్కారం …
విషయం: మైనర్ బాలికపై హైదరాబాదులో జరిగిన అత్యాచారంపై సిబిఐ విచారణ కోరాలి …
మైనర్ బాలికపై హైదరాబాదులో సామూహిక అత్యాచారం జరిగిన విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఈ దురదృష్ట సంఘటనపై రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు అత్యంత బాధాకరం. ఈ సంఘటన జరిగి నాలుగురోజులు కావొస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీస్‌శాఖ వ్యవహరిస్తోన్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం, పోలీస్‌శాఖ వ్యవహరిస్తోన్న తీరును పరిశీలిస్తే నిందితులకు అండగా నిలబడుతున్నట్లు స్పష్టమౌతుంది.
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినవారిలో రాజకీయంగా పలుకుబడి వున్నవారు ముఖ్యంగా రాష్ట్ర హోంశాఖామంత్రి మనుమడు, మీకు రాజకీయమిత్రులైన ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు, వక్ప్‌బోర్డు చైర్మన్ కుమారుడు, టీఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యుల ప్రమేయం
ఉన్నట్లు ప్రాథమికంగా ఇప్పటికే మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌శాఖ హోంమంత్రి కుటుంబసభ్యుల ప్రమేయంపై స్పష్టత ఇచ్చి, అనుమానాలకు తావు లేకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు వెంటనే రాష్ట్రహోంశాఖామంత్రిని, పోలీస్‌శాఖ ఉన్నతాధికారులను ఈ సంఘటనపైన స్పష్టత ఇప్పించాలని బిజెపి తెలంగాణ శాఖ తరుపున కోరుతున్నాం.
మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంలో అధికారంలో వున్న పెద్దల కుటుంబసభ్యులు ఈ సంఘటనతో సంబంధం ఉండటంతో పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరుపుతారనే నమ్మకం ప్రజలకు సన్నగిల్లింది. ఇప్పటికే అధికారంలో వున్న పెద్దలను, ఎంఐఎం పార్టీకి చెందిన కుటుంబసభ్యులను కేసునుండి తప్పించడానికి సీసీ ఫుటేజ్‌ను, ఇతర ఆధారాలను తారుమారు చేసి కేసును పక్కదారి పట్టించి నిందితులను కాపాడటానికి పోలీస్‌శాఖ శతవిధాల ప్రయత్నిస్తోంది. బాధితులకు అండగా నిలబడి దోషులకు శిక్ష పడేవరకు బిజెపి తెలంగాణశాఖ వారికి అండగా నిలబడుతుంది.
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన అసలైన నిందితులను పట్టుకోవడం కోసం, ఆ సంఘటనపై నిష్పకపాతంగా దర్యాపు జరపడంకోసం సిబిఐకి ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పాలని బిజెపి తెలంగాణ శాఖ తరుపున విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారపార్టీతో సన్నిహిత సంబంధాలు, పలుకుబడి కలిగినవారు మీకు రాజకీయ మిత్రుడైన ఎంఐఎం పార్టీకి చెందిన కుటుంబసభ్యులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు ఆ అనుమానాలను నివృత్తి చేయడం కోసం, దర్యాప్తు నిష్పాక్షికంగా జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోలీస్‌శాఖ కాకుండా స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ చేత విచారణ జరిపించడం ప్రభుత్వం కనీసం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వ బేషాజాలకు పోకుండా వెంటనే మైనర్ బాలికపై హైదరాబాద్‌లో జరిగిన సంఘటనపై సీబీఐ విచారణకు ముందుకు రావాలని బిజెపి తెలంగాణ శాఖ తరుపున కోరుతున్నాం.
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై, డ్రగ్స్, గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న అనేక సంఘటనలపై అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని, తెలంగాణ రాష్ట్రంలో పబ్బులను వెంటనే మూసివేయాలని కోరుతున్నాం. రాష్ట్రప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ముందుకురాని పక్షంలో న్యాయపరంగా బిజెపి తెలంగాణశాఖ పోరాడి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.
అభినందనలతో …
– బండి సంజయ్‌కుమార్, ఎం.పి,
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి