Suryaa.co.in

Editorial

కమ్మ ఓట్లపై కమలం కన్ను?

– పురందీశ్వరికి ఆ వ్యూహంలోనే భాగంగానే పట్టం?
– పరిశీలనలో లేకపోయినా హటాత్తుగా ప్రత్యక్షం
– పురందీశ్వరి ఎంపిక వెనుక ప్రధాని మోదీ?
– ఎన్టీఆర్‌ కుమార్తె కార్డుతో జనంలోకి
– కమ్మ వారికి పట్టం కట్టామన్న ప్రచారాస్త్రం
– పురందీశ్వరి ఎంపికతో టీడీపీతో బీజేపీ పొత్తు లేనట్లేనా?
– టీడీపీ-జనసేనకే పొత్తు పరిమితమా?
– టీడీపీపై వ్యతిరేకతతోనే పురందీశ్వరికి పట్టం కట్టారా?
– కమ్మ వర్గంలో చీలికతో వైసీపీకి లబ్ది
– వైసీపీకి లాభం చేకూర్చే నిర్ణయమన్న అనుమానం
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ-బీజేపీ పొత్తు సంకేతాలకు పురందీశ్వరికి బీజేపీ అధ్యక్ష పదవితో తెరపడినట్లేనా? ఏపీలో టీడీపీకి చెక్‌ పెట్టేందుకు, కమ్మ వర్గాన్ని దరిచేర్చుకునే వ్యూహంలో భాగంగానే పురందీశ్వరి ఎంపిక జరిగిందా? హటాత్తుగా జరిగిన ఈ పరిణామాల వెనుక, పురంధీశ్వరికి ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయా?.. శరవేగంతో జరిగిపోయిన ఏపీ బీజేపీ పరిణామాలు పరిశీలిస్తే.. వీటికి అవుననే సమాధానం వస్తోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం, కొంత కాలం నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఐదేళ్ల తర్వాత భేటీ అయిన తర్వాత, ఆ ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. దానికంటే ముందు.. టీడీపీ-జనసేన కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరిగింది. అటు టీడీపీ సీనియర్లు కూడా.. బీజేపీతో పోటీ చేస్తే మైనారిటీ ఓట్లు పోయే ప్రమాదం ఉంది. అందువల్ల జనసేనతో కలసి పోటీచేస్తేనే, రాజకీయంగా ప్రయోజనమన్న వాదన వినిపించారు.

తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించింది. ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందీశ్వరిని నియమించింది. బీజేపీ నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమయింది. ఈ నిర్ణయం బీజేపీ-టీడీపీ పొత్తుపై ఉంటుందా? ఉండదా? అన్న ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. కారణం.. పురందీశ్వరి కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకురాలు, ఎన్టీఆర్‌ కుమార్తె కావడమే.

ఎన్టీఆర్‌ కుమార్తెగా ఆమెకున్న వార సత్వాన్ని వినియోగించుకుని, యావత్‌ కమ్మ సామాజికవర్గాన్ని దరి చేర్చుకోవాలన్నది, బీజేపీ వ్యూహంగా స్పష్టమవుతోంది. వెంకయ్యనాయుడు హవా నడిచింతకాలం, బీజేపీలో చాలామంది కమ్మ నేతలు ఉండేవారు. కంభంపాటి హరిబాబు, కామినేని శ్రీనివాసరావుతో పాటు, జిల్లా స్థాయిలో కమ్మ ప్రముఖులు పార్టీలో కీలక బాధ్యతల్లో ఉండేవారు. హరిబాబుకు గవర్నర్‌ రావడంతో ఆయన వేరే రాష్ర్టానికి వెళ్లిపోయారు.

వెంకయ్య రాజకీయ నిష్ర్కమణ తర్వాత, బీజేపీలోని కమ్మ వర్గం క్రియాశీలకంగా పనిచేయడం మానేసింది. కేవలం ఒకరిద్దరు మాత్రమే చురుకుగా పనిచేస్తున్నారు. జిల్లా స్థాయిలోని కమ్మ వర్గం, టీడీపీ వైపు మళ్లింది. ఆ క్రమంలో ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందీశ్వరికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చి, తెలుగు రాష్ర్టాల్లోని కమ్మవర్గాన్ని బీజేపీ నాయకత్వం మెప్పించింది.

అయితే హటాత్తుగా ఆమెకు.. ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం చర్చనీయాంశమయింది. బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా.. సొంతగా ఎదిగేందుకు కమ్మవర్గం ఓట్లను చీల్చే వ్యూహంతోనే, ఆమెకు అధ్యక్ష పదవి ఇచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఎన్టీఆర్‌ వారసురాలిగా ఆమెను రాజకీయంగా వినియోగించుకోవాలన్నదే, బీజేపీ నాయకత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వ్యూహంతోనే ఆమె పేరు, ప్రధాని స్వయంగా సూచించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజకీయంగా ప్రభావం చూపే కమ్మ వర్గం.. పురందీశ్వరి రాకతో బీజేపీ వైపు మొగ్గు చూపుతుందన్న అంచనా బీజేపీ నిర్ణయంలో కనిపిస్తోంది.

తాజా నిర్ణయంతో టీడీపీకి దశాబ్దాలుగా మద్దతునిస్తున్న.. కమ్మ సామాజికవర్గంలో చీలిక తీసుకువచ్చి, వారిని బీజేపీ ఓటు బ్యాంకుగా మార్చితే.. ఆ ఫలితాలు వచ్చే ఎన్నికల్లో కాకపోయినా, కనీసం మళ్లీ వచ్చే ఎన్నికల్లో చూపిస్తాయన్నది నాయకత్వ అంచనా అని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సహజంగా బీజేపీ వ్యూహాలు ఇలాగే దీర్ఘకాలిక లక్ష్యంతో ఉంటాయని నేతలు గుర్తు చేస్తున్నారు. పురందీశ్వరిలో ఎన్టీఆర్‌ను చూసే సంప్రదాయ కమ్మవర్గం, ఆమెకు అధ్యక్ష పదవి ఇచ్చిన బీజేపీకి కృతజ్ఞతతో ఓటు వేస్తారన్న అంచనా కూడా, నాయకత్వ నిర్ణయంలో లేకపోలేదని చెబుతున్నారు.

శరవేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో.. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తుకు తెరపడినట్లేనన్న భావన.. అటు బీజేపీ-ఇటు టీడీపీ వర్గాల్లో కూడా కనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు వైసీపీకి రాజకీయంగా లాభించేవేనని, ఆ పార్టీకి పరోక్షంగా లాభం చేకూర్చేందుకే తీసుకున్న నిర్ణయంగా, బీజేపీ-టీడీపీలోని మరో వర్గం అనుమానిస్తోంది.

పురందీశ్వరికి అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల.. కమ్మ వర్గం గంపగుత్తగా బీజేపీ వైపు చూస్తుందన్న నాయకత్వ అంచనా ఫలిస్తుందో, లేదో చూడాలి. నిజంగా అదే జరిగితే.. వైసీపీ నెత్తిన బీజేపీ పాలుపోసినట్లేనన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

LEAVE A RESPONSE