Suryaa.co.in

Editorial

‘కమల వనం’లో ఇక కొత్తనీరు

-కొత్త నేతల చేరికపై దృష్టి
-ఉత్తుత్తి ఉద్యమాలు వద్దు
-మతమార్పిడి లపై ఇక సీరియస్ ఉద్యమం
-35 శాతం ఓట్ల సాధనకు కార్యాచరణ
-సత్య కుమార్ కు సమన్వయ బాధ్యతలు
-ఏపీ కమల దళానికి నాయకత్వ దిశానిర్దేశం
(మార్తి సుబ్రహ్మణ్యం)
అమిత్ షా పర్యటన తర్వాత ఏపీ బీజేపీ లో ఊహించని కదలిక మొదలైంది. ఇటీవలే కోర్ కమిటీ ప్రకటించిన నాయకత్వం, తాజాగా ఇతర పార్టీల నుంచి ఇతర పార్టీల నుంచి, నేతలను చేర్చుకునే అంశంపై సీరియస్గా దృష్టి సారించింది. ఆ మేరకు జాతీయ పార్టీ సహాయ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, కేంద్ర మంత్రి-ఇంచార్జి మురళీధరన్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అగ్ర నాయకులకు పలు బాధ్యతలు అప్పగించారు.
ఏపీలో 35 శాతం ఓట్ల సాధనకు బిజెపి ప్రణాళిక ప్రారంభించింది. ఇప్పటివరకు బీజేపీకి కేవలం ఐదు శాతం ఓటు బ్యాంకు మాత్రమే ఉందని గుర్తించిన జాతీయ నాయకత్వం, దానిని 35 శాతం మేరకు పెంచే దిశగా సమిష్టి ప్రణాళిక రూపొందించుకునే మార్గాలు అన్వేషించాలని ,రాష్ట్ర నాయకులకు సూచించింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పై పూర్తి స్థాయిలో వ్యతిరేకత నెలకొందని, టిడిపి ప్రస్తుత పరిస్థితుల్లో ఎదిగే అవకాశం లేనందున.. ప్రత్యామ్నాయం పై సీరియస్గా దృష్టి సారించాలని ఆదేశించింది. ఆ మేరకు పార్టీ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, మంత్రి మురళీధరన్ రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, సీఎం రమేష్ లకు కొత్తవారిని చేర్పించే బాధ్యతలు అప్పగించారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి పార్టీ నిర్మాణం ,విస్తరణ బాధ్యతలు అప్పగించగా ,రాష్ట్రంలో పార్టీని సమన్వయ పరిచే బాధ్యతను జాతీయ కార్యదర్శి సత్య కుమార్ కు అప్పగించారు.
బిజెపి రాష్ట్ర కమిటీ సమావేశం తొలిసారి సీరియస్ గా జరిగింది. ఈ సందర్భంగా శివ ప్రకాష్, మురళీధరన్ కొన్ని కఠినమైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. నాయకులు ఉత్తుత్తి ఉద్యమాలు చేయవద్దని.. సుదీర్ఘ ఉద్యమాలు, సంపూర్ణ ఫలితాలు సాధించే ఉద్యమాలు నిర్వహించాలని చురకలంటించారు. ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలు ఏమాత్రం సరిపోవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రైస్తవ మత మార్పిడులు దేశంలోకెల్లా శరవేగంగా జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర నాయకత్వం దానిని అడ్డుకోలేక పోతుందని మురళీధరన్ వ్యాఖ్యానించారు.
తిరుపతి లోక్ సభ ,బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు సమీక్షించిన తర్వాత ..రాష్ట్రంలో బీజేపీకి , ఐదు శాతం ఓటు బ్యాంకు మాత్రమే ఉందని భావిస్తున్నట్లు శివ ప్రకాష్ వ్యాఖ్యానించారు. 35 శాతానికి పెంచేందుకు మీ వద్ద ఏం ప్రణాళికలు ఉన్నాయి అని ప్రశ్నించారు. మనకు గేమ్ ప్లాన్ కావాలి అది మీ దగ్గర ఉన్నట్లు కనిపించడం లేదు అని వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని గా ఉంటే దేశానికి వచ్చే ప్రయోజనాలు, ఇప్పటివరకు కేంద్రం సాధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం నాయకులకే ఉందని స్పష్టం చేశారు. ప్రెస్ మీట్ ,సమావేశాలతో ఎలాంటి ఉపయోగం ఉండదని చురకలు అంటించారు.
రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటివరకు గోల్ ఉన్నట్లు కనిపించడం లేదని, గోల్ పెట్టుకొని పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అర్హులైన అభ్యర్థులను గుర్తించి, వారిని ఇప్పటినుంచే ప్రోత్సహిస్తే నే 35 శాతం ఓట్లు సాధించవచ్చని సూచించారు. అప్పటివరకు 35 శాతం ఓట్ల గురించి మాట్లాడే హక్కు ఉండదని శివ ప్రకాష్ నాయకత్వం స్పష్టం చేశారు.
ఏపీ నాయకత్వం మీడియాకు దూరంగా ఉండటంపై , ఇద్దరు జాతీయ అగ్రనేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాకు దగ్గర కావాలని, దూరంగా ఉంటే నష్టపోయేది పార్టీయేనని వ్యాఖ్యానించారు. ఏపీ అధికార పార్టీ మీడియాతో సహా, అందరికీ మన పార్టీ కార్యక్రమాలు వివరాలు పంపించాలని సూచించారు. మీడియా ప్రాధాన్యం గుర్తించాలని చెప్పారు. అయితే నాయకులు మీడియాకు టూల్ గా మార వద్దని, మీడియానే టూల్ గా మార్చుకోవాలని మురళీధరన్ సూచించారు. కాగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ను శివ ప్రకాష్ అభినందించారు. సోము వీర్రాజు నాయకత్వంలో, రాష్ట్ర పార్టీ చురుకుగా పని చేస్తుందని వ్యాఖ్యానించారు.
తొలిసారి నలుగురు ఎంపీల ప్రెస్ మీట్
bjp-mpsగత మూడేళ్ల కాలంలో ఏపీ బీజేపీ లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఎడమొహం పెడమొహంగా ఉండే నలుగురు ఎంపీలు, ఒకే వేదికపై పైకి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించడం విశేషం. జీవీఎల్ నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, జి వెంకటేష్ నలుగురు ప్రెస్ మీట్ నిర్వహించి, వైసీపీ ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు సంధించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ పరిణామం పార్టీలో కొత్త ఉత్సాహం తో పాటు, మంచి సంకేతాలు పంపిస్తా యని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధానం అనుసరిస్తే, విమర్శలు వచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE