– ఫసల్ బీమా యోజన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలేదు
– పంటల విషయంలో నూతన పద్ధతులు, మార్పులు అవసరం
– మార్పు కోసం ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలి
– చేవెళ్ల మండలం చన్ వల్లి గ్రామ రైతు సమ్మేళనంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు
చన్ వల్లి: నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద చిన్నకారు రైతులకు ప్రతి ఏడాది మూడు దశల్లో ఖాతాల్లో మొత్తం రూ. 6,000 చొప్పున జమ చేస్తోంది. ఇప్పటివరకు క్రమం తప్పకుండా మూడు దఫాల్లో రైతుల అకౌంట్లలో కిసాన్ సమ్మాన్ నిధులు చేరాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది.
గతంలో కాంగ్రెస్ పార్టీ “రైతు భరోసా” కింద రూ. 15,000 ఇస్తామని చెప్పింది, కానీ 19 నెలలు దాటినా అమలు చేయలేదు. రైతులకు అన్ని హామీలు బంద్ అయ్యాయి. ఇక్కడి ప్రాంతంలో రెగ్యులర్ క్రాప్స్ కాకుండా ఫ్లోరీకల్చర్ పంటలు సాగు చేస్తున్నారు. ఇదేవిధంగా రైతుల ఆలోచన విధానం మారాలి. పంటల విషయంలో నూతన పద్ధతులు, మార్పులు అవసరం.
మోదీ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందుతున్నాయి. రైతులకు 60 శాతం సబ్సిడీ NABARD నుండి లభిస్తోంది. నేషనల్ హార్టికల్చర్ బోర్డు కింద వివిధ పథకాల ద్వారా రైతులకు మేలు జరుగుతోంది. ములుగులో కేంద్ర ప్రభుత్వం హార్టికల్చర్ యూనివర్సిటీని ప్రారంభించింది. వ్యవసాయంలో అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి.
నెదర్లాండ్ వంటి దేశాల నుంచి సీడ్స్ దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్తులో మన దేశం నుంచే సీడ్స్ ఇతర దేశాలకు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. అందుకే మోదీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం, సహాయసహకారాలు రైతులకు అందిస్తోంది.
రైతుకు లాభం జరగాలి. 27 రకాల పంటల్లో – ఆయిల్ సీడ్స్, ఫుడ్ గ్రెయిన్స్, ఆహారగింజలు, పప్పు ధాన్యాలు – ఇలా మినిమమ్ సపోర్ట్ ప్రైజ్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తోంది. గత యూపీఏ పాలనలో అనేక సంవత్సరాలుగా పంటలకు మద్దతు ధరలను సరిగ్గా పెంచలేదు. అలాగే సాగునీటి విషయంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో అరచేతిలో వైకుంఠం చూపించి మరిచిపోయింది.
ఇరిగేషన్ విషయంలో, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) కింద బోర్ వెల్స్ కోసం అనేక స్కీమ్‌లకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తోంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం కూడా సద్వినియోగం చేయాలి, కానీ కేంద్రానికి పేరు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
అదేవిధంగా, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినప్పుడు, రైతులకు ఫసల్ బీమా యోజన కింద నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడంలేదు. కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షలు చేసి, పంటల సాగు యోగ్యత గురించి సాయిల్ హెల్త్ కార్డులు అందిస్తోంది. రైతుల జీవితాల్లో గొప్ప మార్పు కోసం కేంద్రం పనిచేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది తప్ప ఏది అమలు చేయలేదు. రైతుల సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్పితే మరేదీ అమలు చేయలేదు. అందులోనూ బస్సుల సంఖ్యను తగ్గించి ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే రైతులకు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తాం. రైతుల పంటలకు సాంకేతిక, ఆర్థిక మద్దతుతో పాటు, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం. రైతుల గురించి ఆలోచించే పార్టీ బిజెపి, ఆలోచించే ప్రభుత్వం మోదీ ప్రభుత్వమే.
మొన్న వరంగల్ పర్యటనలో భాగంగా రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నాను. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలు చేసిందా అని అడిగితే ఏ ఒక్క రైతు కూడా పూర్తి రుణమాఫీ అమలైనట్లు హ్యాండ్ రైజ్ చేయలేదు. రైతులకు రుణమాఫీ దేవుడెరుగు. తీసుకున్న అప్పులు తీర్చమని బ్యాంకర్లు రైతులను వేధిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ హామీలు మర్చిపోయి, రైతు సమస్యలను పక్కన పెట్టింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామీణ పేదల కోసం ఉచిత బియ్యం, ఇళ్ళు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, పొదుపు సంఘాల మహిళలకు బ్యాంక్ రుణాలు, యువతకు స్వయం ఉపాధి రుణాల వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.
గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, స్మశాన వాటికలు, రైతు వేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం వంటి అనేక కార్యక్రమాలు కేంద్ర సహకారంతోనే అమలవుతున్నాయి. ప్రధాన మంత్రి సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి దేశవ్యాప్తంగా రూ. 60 వేల కోట్లతో పక్కా రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చారు, కానీ ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. నిజమైన అభివృద్ధి కోసం, గొప్ప మార్పు కోసం ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు.