– బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
కమ్యూనిస్టులను వేలెత్తి చూపే అర్హత బిజెపి నేతలకు లేదని, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్, కమ్యూనిస్టు శ్రేణులు మాత్రమేనని; బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు ఏపీకి కేవలం ఒక గెస్ట్ ఆర్టిస్ట్ మాత్రమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహారావు తనకు మెలకువ వచ్చినప్పుడు ఏపీకి ఒక గెస్ట్ ఆర్టిస్టులా వచ్చి, నోటికొచ్చినట్లు మాట్లాడేసి వెళుతుంటారు. ఆయన పదవి ఉత్తరప్రదేశ్ నుండి ఉన్నప్పటికీ, పాకులాట-పైరవీలు మాత్రం ఢిల్లీలో చేస్తుంటారు.
భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్, కమ్యూనిస్టు శ్రేణులేనన్నది చారిత్రక సత్యం. కాని బ్రిటిష్ వారికి దాసోహమన్న ఆర్ఎస్ఎస్ వాదులు స్వాతంత్ర పోరాటం గురించి వక్రీకరిస్తున్నారు. బిజెపి నేతలు చెప్పే నీతులు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కమ్యూనిస్టులను వేలెత్తి చూపే అర్హత బిజెపికి లేదు. కమ్యూనిస్టులపై జివిఎల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కమ్యూనిస్టులపై అవాకులు చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
గత తొమ్మిది ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ దేశ ప్రజల ఇచ్చిన హామీలను నీటిమూటలుగా మార్చారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి దేశ ప్రజల ఖాతాల్లో వేస్తామన్న మోడీ హామీ ఏమైందని; ఏటా కోటి ఉద్యోగాల కల్పన గత 9 ఏళ్లలో ఏమైందని ప్రశ్నిస్తున్నాం. అంబానీ ఆదానీల వంటి కార్పొరేట్ శక్తులకు తప్ప, దేశ ప్రజల కోసం కేంద్రంలో బిజెపి చేసింది శూన్యం.
ఏపీకి బీజేపీ అడుగడుగునా ద్రోహం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ సర్కార్ మోసం చేసింది. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి నిధులు, పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలకు నిధులు ఇవ్వలేదు.
ఏపీకి మొండి చేయి చూపిన బిజెపి ఏ మొహం పెట్టుకొని జనసేన వెంట పడుతోంది. దమ్ముంటే ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలి. నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి రావటం ఖాయమని స్పష్టం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజాతంత్ర, లౌకిక శక్తులతో కలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేస్తున్నాం.