-టీఆర్ఎస్ మంత్రుల్లో సగం మంది తెలంగాణ రాష్ట్రం వద్దన్నవాళ్లేనన్న ఈటల
-రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజ్యాంగమే నడవాలన్నట్టు ఉందని విమర్శ
-ఢిల్లీలో చక్రం తిప్పడం కాదు.. ఉన్నది కూడా ఊడుతుంది.. సీఎం కేసీఆర్ పై ఈటల ఫైర్
-బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
సీఎం కేసీఆర్ కు ఢిల్లీ చక్రం తిప్పడం కాదు, ఇక్కడ ఉన్న ఉద్యోగం కూడా ఊడుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యంగ్యంగా అన్నారు. టీఆర్ఎస్ సర్కారులో ఉన్న మంత్రుల్లో సగం మంది తెలంగాణ రాష్ట్రాన్ని వద్దన్న వారేనని.. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం జరగడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ రాజ్యాంగమే నడవాలన్నట్టుగా వైఖరి ఉందని.. కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యమని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ‘ప్రజాసంగ్రామ యాత్ర’ ప్రారంభ సభలో ఈటల మాట్లాడారు. రాష్ట్రంలో వరదలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు.
దళితుల భూములు గుంజుకుంటున్నారు
గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని.. అదే సమయంలో సీఎం కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి వెళ్లలేదని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ అయితే ప్రగతి భవన్ లో, లేకుంటే ఫామ్ హౌస్ లో ఉంటారని.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మాత్రం రావడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు దళితుల అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పే అవకాశం త్వరలోనే వస్తుందని, కేసీఆర్ పాలనను అంతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.