– 5 వేల గ్రామాల్లో వీధిసభలకు సన్నాహాలు
– అసెంబ్లీకి కనీసం 30 గ్రామాల్లో సభలు
– కేంద్ర పథకాల వివరాలతో ఇంటింటికీ కరపత్రం
– కేంద్ర పథకాలకు జగన్ స్టికర్ల జాబితా విడుదల
– మోర్చాల బలోపేతంపై దృష్టి
– 5 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి నిర్ణయం
– అభ్యర్ధిత్వాలపై అభిప్రాయ సేకరణ
– ఏపీలో కమలం కసరత్తు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో బలపడేందుకు బీజేపీ సీరియస్‌గా దృష్టి సారించింది. తాజాగా వినాయక మండపాలకు ఫీజులకు సంబంధించి.. సర్కారు నిర్ణయంపై ఆందోళన నిర్వహించిన బీజేపీ పోరాటాలకు స్పందించిన జగన్ సర్కారు, ఫీజులు వసూలు చేయడం లేదని ప్రకటించింది. ఈ అంశం బీజేపీలో సమరోత్సాహం నింపినట్టయింది. ఇదే స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు చేయాలని పదాధికారుల సమావేశం తీర్మానించింది.>
అందులో భాగంగా పార్టీ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా, రాష్ట్రవ్యాప్తంగా వీధి సభలు నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం 5 వేల గ్రామాల్లో వీధి సభలు నిర్వహించేలా సన్నాహాలు చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 30 నుంచి 35 గ్రామాల్లో బస్తీ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభలో రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయం, వివిధ పథకాలకు ఇస్తున్న నిధులు, వాటిని జగన్ ప్రభుత్వం ఏవిధంగా పక్కదారి పట్టిస్తూ, దుర్వినియోగం చేస్తున్న తీరును వీధి సభల్లో వెల్లడించనుంది.
ప్రధానంగా గ్రామాల అభివృద్ధికి కేంద్రం నేరుగా ఇస్తున్న నిధులు, దానితో చేపట్టిన అభివృద్ధి పనులేమిటన్నది, బీజేపీ నేతలు ఆ వీధి ప్రజలకు వెల్లడించనునున్నారు. దానితోపాటు.. కేంద్ర నిధులకు జగన్ స్టిక్కర్లు వేసి చేపడుతున్న పథకాల వివరాలతో కూడిన కరపత్రాలు, ప్రతి ఇంటికీ అందచేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది.
ఇప్పటివరకూ గ్రామాల్లో ఏమాత్రం ఉనికి, ప్రవేశం లేని బీజేపీ ఈ సభలతో రాజకీయ అరంగేట్రం చేయాలన్న లక్ష్యంతో వీధిసభలకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ గ్రామాల్లోకేవలం వైసీపీ-టీడీపీలకు మాత్రమే బలం ఉంది. కమిటీలు కూడా ఉన్నాయి. జనసేన కొన్ని గ్రామాల్లో ఉనికి సంపాదించుకుంది. బీజేపీ సైతం స్వల్ప గ్రామాల్లో పట్టు సాధించింది. అది కూడా పార్టీ నాయకులు సొంతంగా నిర్మించుకున్న పునాదులే కావడంతో, పార్టీ ఉనికిని విస్తరించాలంటే వీధి సభలు అవసరమని బీజేపీ నాయకత్వం గుర్తించింది. ఈ కార్యక్రమాల వల్ల.. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 30 గ్రామాల్లో పట్టు సాధించాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇక ఇటీవల విజయవాడలో బీజేవైఎం నిర్వహించిన సభ విజయవంతం కావడం పార్టీ నాయకత్వాన్ని సంతృప్తి పరిచింది. ఆ సభపై చర్చించిన పార్టీ అగ్రనేతలు.. నిస్తేజంగా ఉన్న ఇతర మోర్చాలను కూడా బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు తగిన ప్రణాళిక, కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో మోర్చాలను ముందు వరసలో ఉంచాలన్నది పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది.
ఇక రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని నాయకత్వం నిర్ణయించింది. 2 టీచర్, 3 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశం నిర్ణయించింది. ఆ మేరకు అభ్యర్ధులను గుర్తించి, దానికంటే ముందుగానే ఓటరు నమోదు కార్యక్రమంపై దృష్టి సారించాలని నిర్ణయించింది. పోటీ చేయాలనుకున్న అభ్యర్ధులతో అభిప్రాయసేకరణ నిర్వహించి, కోర్ కమిటీలో జాబితాను ఫైనల్ చేసి జాతీయ నాయకత్వానికి పంపనున్నారు.
బీజేపీ జాతీయ సంఘటనా సహ ప్రధానకార్యదర్శి ప్రకాష్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరయిన ఈ సమావేశంలో.. ప్రధానంగా మోర్చాల బలోపేతంపై ఎక్కువగా చర్చించారు.