Suryaa.co.in

Telangana

కేసీఆరు సారూ… మీరిచ్చిన హామీలు ఏమాయె?

– తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తొలిలేఖ

9 ఏళ్లుగా రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగా ప్రజలకు జరుగుతున్న నష్టాలు, సర్కారు హామీలు ఇచ్చి ప్రజలను మోసంచేసిన అంశాలను ప్రస్తావిస్తూ.. మిగిలున్న 4 నెలల్లో అయినా.. హామీలను పూర్తిచేయాలని కోరుతూ .. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు.

ఆ లేఖ సారాంశం..

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు,
తెలంగాణ ముఖ్యమంత్రి,
సచివాలయం,
హైదరాబాద్.
ఆర్యా¡
విషయం: తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ..
పోరాడి సాధించుకున్న తెలంగాణలో బతుకులు బాగుపడ్తాయని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను పెంచుతూ 2014, 2018 ఎన్నికల ప్రచారం సందర్భంలో, ఎన్నికల ప్రణాళికల్లో, వివిధ జిల్లాల్లో పర్యటనలప్పుడు, అసెంబ్లీ సమావేశాల్లోనూ మీరు అనేక సార్లు అనేక హామీలు ఇచ్చారు. కానీ వాటి అమలు మరిచారు.

ఏళ్లు గడుస్తున్నా ఆ హామీలకు అతీగతీలేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. మీ పదవీకాలం కొన్ని నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో మీరు హామీ ఇచ్చి అమలును మరిచిపోయిన వాటిని మరోసారి మీ దృష్టికి తీసుకొస్తూ, వాటిని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను.

1. ఏకమొత్తంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటూ రైతులకు పెద్దఎత్తున ఆశలు కల్పించి వారితో ఓట్లు వేయించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏకమొత్తంలో కాదు, విడతలవారీగా మాఫీ చేస్తామంటూ దానిని నీరుగార్చారు. రుణం మాఫీ అవుతుందన్న ఆశతో రైతులు వడ్డీలు కట్టలేదు. వడ్డీలు పేరుకుపోయి అసలును మించిపోయింది. వడ్డీలు కడదామనుకున్న కట్టలేని పరిస్థితి ఏర్పడింది.

రుణ రికార్డు బాగోలేని కారణంగా బ్యాంకులు కొత్త రుణాలివ్వడం లేదు. ఫలితంగా పేద రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి తలెత్తింది. దీనికంతటికీ మీరు రుణమాఫీ హామీ నెరవేర్చకపోవడమే కారణం. మీ హామీ రైతులకు మేలు చేయకపోవగా, కీడే ఎక్కువ చేసింది. యుద్ధప్రాతిపదికన ఏకమొత్తం లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు, 2018 హామీ ఇచ్చి జాప్యం చేయడం వల్ల రైతులపై పడిన అదనపు వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించాలి.

2. తెలంగాణలో అడవిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజనులు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఏళ్లుగా ఆయా భూముల్లో వ్యవసాయం చేస్తున్నా వీరికి వాటిపై చట్టపరమైన హక్కులు కల్పించలేదు. ఇటీవల ప్రభుత్వ భూములంటూ అటవీ అధికారులు వచ్చి వారిని అడ్డుకోవడం వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఫలితంగా పేద గిరిజనులు బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు.

రాష్ట్రంలో ఏ ఎన్నిక, ఉప ఎన్నిక వచ్చినా పోడు భూములకు పట్టాలిస్తామని మీరు హామీ ఇస్తున్నారు, ఎన్నికలయ్యాక ఆ హామీని మరచిపోతున్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న అర్హులైన గిరిజనులను గుర్తించి, తక్షణమే వారికి ఆ భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

3. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష వెనక నిరుద్యోగ సమస్య ఒక ప్రధాన కారణం. అయినప్పటికీ మీరు నియామకాలు చేపట్టకపోగా, కనీసం నిరుద్యోగ భృతి హామీని సైతం నెరవేర్చలేదు. 2018 ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3016 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా, బయటా నిరుద్యోగ భృతి హామీ ఇస్తూనే వచ్చారు. మరో 3-4 నెలల్లో మీ పదవీకాలం ముగుస్తున్నా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తక్షణమే నిరుద్యోగులకు నెలకు రూ.3016 భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

4. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తుందని 2014 ఎన్నికల నుంచి అనేకసార్లు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో లక్షల మంది ఇల్లు లేని పేదలు సొంతింటి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 9 ఏళ్లుగా వారి ఆశలు అడియాసలవుతూనే ఉన్నాయి. 2018 ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ చాలా కొన్ని ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. శంకుస్థాపనలు చేసి ఐదేళ్లవుతున్నా పూర్తి కాని ఇళ్లే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల మధ్యలో నిర్మాణం ఆపడం వల్ల అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. మీరు హామీ ఇచ్చిన విధంగా తక్షణమే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందివ్వాలి.

5. సాధారణంగా పెన్షన్లు, రేషన్ కార్డుల జారీ నిరంతరం ప్రక్రియ. ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులు జతవుతూ ఉంటారు. కానీ మన రాష్ట్రంలో ఎప్పుడోఒకప్పుడు మాత్రమే అరకొర కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత నిలిపేస్తున్నారు. పెన్షన్ కోసం, కొత్త రేషన్ కార్డు కోసం అర్హతలున్న వారు ఎంతో మంది ఏళ్లుగా నిరీక్షిస్తున్నా వారికి మాత్రం మంజూరు కావడం లేదు. వృద్ధాప్య పెన్షన్ వయస్సు తగ్గించారు కూడా. కొత్త పెన్షన్లు జారీ చేయకపోవడం వల్ల వారు ఆ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఫలితంగా మీ హామీ నెరవేరడం లేదు. తక్షణమే కొత్తగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

6. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ‘దళితబంధు’ ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలతో పోలిస్తే, మీరిచ్చింది ఏమాత్రం లెక్కలోకి లేదు. అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలే 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని మీరే స్వయంగా చెప్పారు. ఆ కొద్దిమందికి కూడా పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరలేదని తెలుస్తున్నది. ఎలాంటి ఆలస్యానికి, అక్రమాలకు తావివ్వకుండా అర్హతలున్న ప్రతి దళిత కుటుంబానికి తక్షణమే ‘దళితబంధు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.

7. కులవృత్తులపై ఆధారపడిన వెనకబడిన వర్గాలకు రూ.1 లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ పెద్దగా సమయం ఇవ్వకుండానే దరఖాస్తు చేసేందుకు గడువు విధించారు. ఫలితంగా అర్హతలున్నప్పటికీ అవసరమైన పత్రాలు లేని కారణంగా ఎంతో మంది బీసీలు దరఖాస్తు చేయలేకపోయారు. ఎంపిక చేసిన కొంత మందికే కాకుండా, ఈ పథకానికి అర్హులందరినీ గుర్తించి, వారికి కూడా ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రూ.1 లక్ష సాయం ఏమాత్రం సరిపోదు. ఈ సాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలి.

8. తెలంగాణలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఎంతో మంది యువత సొంత ఊరు, ఇల్లు, కుటుంబాన్ని వదిలి జీవనాధారం కోసం గల్ఫ్ లో పని చేస్తున్నారు. ఇలా గల్ఫ్ బాట పట్టిన వారు లక్షల్లోనే ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్ కు వెళ్లినవారు చాలామందే ఉన్నారు. వారి కోసం ప్రభుత్వం NRI పాలసీ తీసుకొస్తుందని, వారి కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని, వారికి అవసరమైన సాయం అందించేందుకు సెక్రటేరియట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ కూడా ఒక్క అడుగు ముందుకు పడలేదు. మీరు హామీ ఇచ్చిన మేరకు తక్షణమే NRI పాలసీ తీసుకొచ్చి, రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి, సెక్రటేరియట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

9. భూముల సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు, పైరవీకారులు, దళారుల బారి నుంచి అమాయక రైతులను కాపాడేందుకు ధరణి తీసుకొచ్చామని మీరు అనేకసార్లు చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ధరణి వల్ల రికార్డుల్లో ఎంతో మంది పేర్లు గల్లంతయ్యాయి. కొందరి ఆస్తులు గల్లంతయ్యాయి. ఒకరి ఆస్తి మరొకరి పేరు మీద రికార్డులు చూపిస్తున్నాయి. ఫలితంగా వారు క్రయవిక్రయాలు జరపలేక, రుణాలు తీసుకోలేక లబోదిబోమంటున్నారు.

భూవివాదాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇదే అదనుగా కొందరు బడాబాబులు, ముఖ్యంగా అధికార పర్టీ నేతల, వారి అనుచరులు ధరణిని అడ్డం పెట్టుకొని కబ్జాలకు తెగబడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా సమస్యేమీ లేదు, అంతా సవ్యంగా ఉందంటూ మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ధరణి వల్ల ఉత్పన్నమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను.

మీరు హామీ ఇచ్చి, విస్మరించిన వాటిలో కొన్ని మాత్రమే పేర్కొన్నాను. సమస్యలు పరిష్కారమయ్యే వరకు, డిమాండ్లు నెరవేరే వరకు బాధితుల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన వారి గుండె చప్పుడును వినిపిస్తూనే ఉంటాం. అందుకోసం పోరాటం కొనసాగిస్తాం. మరో 3-4 నెలల్లో మీ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి, పైన పేర్కొన్న డిమాండ్లు నెరవేర్చాలి. లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గుర్తు చేస్తున్నాను.

జి. కిషన్ రెడ్డి
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

LEAVE A RESPONSE