Suryaa.co.in

Telangana

కలెక్టర్లూ… ప్రధాని ఫోటో ఎందుకు పెట్టడం లేదు?

– కేంద్ర సంక్షేమ పథకాల్లోనూ సీఎం పేరు పెట్టి ప్రధాని పేరు పెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటి?
– మీరు ఐ.ఏ.ఎస్ లని మరిచి, టీఆర్ఎస్ పార్టీకి వంతపాడడం సిగ్గుచేటు
– ప్రధాని పేరు, ఫోటో పెట్టకుంటే కలెక్టర్ల పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా
– బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి

తెలంగాణలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ప్రధాని పేరు, అలాగే కలెక్టర్ల ఛాంబర్లలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను పెట్టకుండా సీఎం కేసీఆర్ పేరు, ఫొటో మాత్రమే పెట్టిన కలెక్టర్ల తీరు చూస్తుంటే.. వారు ఐ.ఏ.ఎస్ లు అని మరిచిపోయి, టిఆర్ఎస్ పార్టీ నాయకుల్ల వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో ఘాటుగా విమర్శించారు.

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో తెలంగాణలోని పట్టణాలకు, మండలాలకు, గ్రామాలకు వేల కోట్ల నిధులు నిత్యం కేటాయిస్తుంటే, ఇవి కేంద్ర నిధులని కలెక్టర్లకు, మిగతా సంబంధిత శాఖల అధికారులకు తెలిసిన, సీఎం కేసీఆర్ ఆదేశాలను మాత్రమే పాటిస్తూ వాటి పై ప్రధాని మోదీ పేరు, ఫోటోను పెట్టకుండా కేసీఆర్ పేరు, ఫోటోను మాత్రమే పెట్టి కేంద్ర నిధులను తమ నిధులుగా తెరాస ప్రభుత్వం చూపెడుతూ జిల్లా కలెక్టర్ల ద్వారా పెత్తనం సాగిస్తున్నారని బేతి మహేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.

గ్రామాల్లో ఉపాధి హామీ పథకం (ఈ.జి.ఎస్) నిధులతో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, వైకుంటదామల నిర్మాణం, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, పంట కల్లాల తదితర నిర్మాణంలో కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ నిధులతో చేపడుతుంటే కనీసం అవి కేంద్ర నిధులని గ్రామాల్లో అధికారులు అక్కడి ప్రజలకు చెప్పకపోవడం, అవన్నీ తెరాస ప్రభుత్వ సొంత నిధులని సీఎం కేసీఆర్ ఖాతాలో వేస్తూ, సొమ్ము కేంద్ర ప్రభుత్వానిధైతే సోకు రాష్ట్ర ప్రభుత్వానిధిగా చూపెడుతున్నారని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు.

ఈ పనుల ప్రారంభోత్సవాలలో కూడా బీజేపీ పార్టీ ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కేవలం తెరాస ప్రజాప్రతినిధులకు మాత్రమే సమాచారం ఇచ్చి వారితో ప్రారంభోత్సవాలు చేయించి ప్రోటోకాల్ ను అధికారులు పాటించడం లేదని బేతి మహేందర్ రెడ్డి వాపోయారు. అందుకే మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నెల నుండి రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి, సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లనున్నాయని, దీంతో ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే పనులకు కేంద్రం నిధులను వాడుకునే అవకాశం ఉండదని, ఈ నిర్ణయంతో కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలిందని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.

ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం 60:40 రేషియోలో పనులు జరుగుతున్నాయని, ఉదాహరణకు ఒక సీసీ రోడ్డును ఉపాధి హామీ కింద నిర్మాణం చేస్తే దానిలో 60 శాతం కూలీలకు వేతనాల క్రింద, 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్కోసం వినియోగిస్తున్నారని, అయితే వీటికి సంబంధించిన నిధులను ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చేవారని, రాష్ట్రం ఈ నిధులను ఎంతో కొంత ఇతర పనులకు డైవర్ట్ చేసుకుని, వారి వీలును బట్టి కూలీలకు, సంబంధిత పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇచ్చేవారని, కేంద్రం నుంచి కూలీలకు 15 రోజుల వ్యవధిలోనే వేతనాలు విడుదలైనప్పటికీ వాటిని రాష్ట్రం వాడుకోవడంతో నెలల తరబడి కూలీలకు చెల్లింపులు ఆలస్యం అయ్యేవని బేతి మహేందర్ రెడ్డి వివరించారు.

అంతేకాకుండా కేంద్ర నిధుల వినియోగంలో నిబంధనల ప్రకారం ప్రతీ పని దగ్గర సెంట్రల్ షేర్ వివరాలు, ప్రధాని పేరు, సంబంధిత మంత్రిత్వ శాఖ వివరాలు, వినియోగించిన నిధులను తేటతెల్లం చేసే సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని, దీంతో ఇక నుండి ఉపాధి హామీ నిధులను వాడుకునే వెసులుబాటు రాష్ట్రానికి ఉండబోదని, దీనితో రాష్ట్రం పెత్తనాన్ని తగ్గిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులకు కేంద్రం నుంచే నేరుగా బిల్లుల చెల్లింపులు జరుగుతాయని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.

ఇదే కాకుండా అలాగే 2020-21 కి 15 వ ఆర్ధిక సంఘ నిధులు తెలంగాణ రాష్ట్రంకు కేంద్రం విడుదల చేసిందని ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, నీటి శుద్ధి, వర్షపు నీటి పొదుపు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత వంటి మౌలిక సదుపాయాలకు ఈ 15వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగపడుతాయని బేతి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆర్ధిక సంఘ నిధుల పనులకు, ఉపాధి హామీ నిధుల పనులకు ప్రధాని మోదీ పేరు, సంబంధిత కేంద్ర మంత్రి పేరు పెట్టకుంటే ఆ పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో కేంద్ర ప్రభుత్వానికి కలెక్టర్ల పై సంబంధిత అధికారుల పై కేంద్రం చర్యలు చేపట్టే విధంగా ఫిర్యాదు చేస్తానని బీజేపీ రాష్ట్ర నాయకులు బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE