Suryaa.co.in

Editorial

బీజేపీ లెక్కలు భలే.. భలే!

-ప్రజాపోరు వీధిసభలకు వింత లెక్కలు
– నాలుగు ప్రాంతాల్లో 578688 మంది జనం హాజరయ్యారట
– 188238 మంది మహిళలు, 390450మంది పురుషులు హాజరయ్యారట
– గత ఎన్నికల్లో 2 లక్షలు దాటని బీజేపీ ఓట్లు
– ప్రజాపోరు లెక్కలు చూస్తే బీజేపీకి అధికారం పక్కా
– ఎంతమంది జనం వచ్చారో లెక్కలేసి చెప్పిన బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి
– మూడు ప్రాంతాల వారీగా వచ్చిన జనాలను లెక్కేసిన బీజేపీ నేత
– అందులో పురుషులు, మహిళలనూ లెక్కబెట్టిన అపూర్వ వైనం
– లెక్కలు చూసి అబ్బురపడ్డ బీజేపీ నాయకత్వం
– ఏపీ ఆర్యభట్టగా అవతరించిన విష్ణువర్దన్‌రెడ్డి
( మార్తి సుబ్రహ్మణ్యం)

మీరు ఆకాశంలో నక్షత్రాలు లెక్కబెట్టగలరా?
పోనీ త లలో వెంట్రుకలెన్నో లెక్కబెట్టగలరా?
అదీ సాధ్యం కాకపోతే బియ్యం, అందులో రాళ్ల సంఖ్య ఎంతో చెప్పగలరా?
కనీసం కందిపప్పు, అందులో రాళ్ల సంఖ్య ఎంతో లెక్కబెట్టగలరా?
పోనీ సింపుల్‌గా ఆవగింజలను లెక్కబెట్టగలరా?
ఇవేమీ వద్దు… ఒక బహిరంగసభకు జనం ఎంతమంది వచ్చారో ఖచ్చితంగా చెప్పగలరా?
ఆ వచ్చిన జనంలో ఆడ-మగ సంఖ్య ఎంతో లెక్కబెట్టగలరా?

మానవమాత్రుడెవరూ వీటిని లెక్కబెట్టడం అసాధ్యం. కానీ.. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, గణిత శాస్త్రజ్ఞుడయిన విష్ణువర్దన్‌రెడ్డికి మాత్రం ఇవన్నీ నల్లేరుపై నడక లాంటివి. గణిత మేధావి ఆర్యభట్టకు సైతం అంతుబట్టని, లెక్కల ప్రాతిపదిక విష్ణువర్దన్‌రెడ్డిది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పార్టీ కార్యక్రమానికి, మూడు ప్రాంతాల్లో ఎంతమంది జనం వచ్చారు? అందులో ‘పుం’ లింగాలెన్ని?‘ స్త్రీ’ లింగాలెన్ని? అనే లెక్కలను పర్‌ఫెక్టుగా.. తలలతో సహా లె క్కలేసి, పార్టీ పెద్దలను మెప్పించిన విష్ణువర్దన్‌రెడ్డి, ఇప్పుడు.. ‘ఏపీ ఆర్యభట’్టగా అవతరించారు. ఆ ముచ్చటేమిటో చూద్దాం.

ఏపీ బీజేపీ నాయకత్వం.. జగన్ సర్కారు వైఫల్యాలు, కేంద్రంలో మోదీ సర్కారు విజయాలను జనాలకు వివరించేందుకు ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించింది. వీధి సమావేశాలు నిర్వహించింది. ముందు 5 వేల వీధి సభలు నిర్వహిస్తామని వెల్లడించింది. వాటికి పార్టీ జిల్లా- రాష్ట్ర- కేంద్ర స్థాయి నేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా బీజేపీ నాయకులు జగన్ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపి, రాష్ట్రానికి మోదీ సర్కారు చేస్తున్న సాయం వివరించారు. ఆ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించారు. అంతవరకూ బాగానే ఉంది.

మరి రాష్ట్ర పార్టీ నిర్వహించిన కార్యక్రమాల వివరాలను ‘పైకి’.. అంటే కేంద్ర నాయకత్వానికి నివేదించాలి కదా? ఆ కార్యక్రమ ఇన్చార్జి విష్ణువర్దన్‌రెడ్డి అదే పని చేశారు. ఎలాగంటే.. అపూర్వం.. అనన్యసామాన్యం.. అనితర సాధ్యమైన రీతిలో ఇచ్చిన నివేదిక అది. ఏపీ బీజేపీ చరిత్రలోనే కాదు. భారతదేశ రాజకీయ పార్టీల చరిత్రలో, ఆ నివేదిక ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అందుకు ఎన్నుకున్న ప్రాతిపదిక ఏమిటన్నది, విష్ణువర్దన్‌రెడ్డికి మాత్రమే తెలిసిన బ్రహ్మరహస్యం.

ఇంతకూ ప్రజాపోరు సభలకు హాజరయిన వారి వివరాల నివేదికలో ఏమున్నదంటే… రాయలసీమలో 2018 వీధిసభలు జరగగా, అందులో 52935 మంది మహిళలు; 132653 మంది పురుషులు, మొత్తం 185588 మంది పాల్గొన్నారు. కోస్తాలో 1667 వీధిసభలు నిర్వహించగా, అందులో 43461 మందిbjp-prajaoru మహిళలు; 88471 మంది పురుషులు, మొత్తం 131932 మంది పాల్గొన్నారు. గోదావరిలో 1805 వీధిసభలు నిర్వహించగా, అందులో 38812 మంది మహిళలు; 118208 మంది పురుషులు, మొత్తం 157020 మంది పాల్గొన్నారు. ఇక ఉత్తరాంధ్రలో 1302 వీధిసభలు నిర్వహించగా, 53030 మంది మహిళలు; 511118 మంది పురుషులు, మొత్తం 104148 మంది హాజరయ్యారు. మొత్తం ఏపీలో బీజేపీ నిర్వహించిన ప్రజాపోరు సభలకు 578688 పాల్గొన్నారట.

విష్ణువర్దన్‌రెడ్డి లెక్కల ప్రకారం.. మొత్తం 6792 వీధిసభలకు, 188238 మంది మహిళలు, 390450మంది పురుషులు హాజరయ్యారు. అంటే ప్రజాపోరు సభలకు 578688 మంది హాజరయ్యారట. ఇదీ విష్ణువర్దన్‌రెడ్డి కేంద్ర పార్టీకి ఇచ్చిన నివేదిక. ఈ వివరాలన్నీ ఆయన తన ఫేస్‌బుక్‌లో సగర్వంగా, రంగు రంగుల గ్రాఫిక్ డిజైన్లతో బాక్సులు కట్టి మరీ ప్రకటించుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలం పెరుగుతున్నది’ అంటూ తాటికాయంత అక్షరాలతో, ప్రాంతాల వారీగా సభలకు హాజరయిన జనాల సంఖ్యను వెల్లడించారు.

అటు ‘విష్ణువర్దన్‌రెడ్డి ప్రవచిత గణితశాస్త్రాన్ని’ రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోధర్ కూడా, కేంద్ర నాయకత్వానికి ధృవీకరించారట. ‘పది పదిహేనుమంది తగ్గినా ఆ లెక్క కరసే’్టనని సపోర్టింగు ఇచ్చుకున్నారట. సహజంగా రాష్ట్ర పార్టీలు నిర్వహించే కార్యక్రమాల గురించి, బీజేపీ జాతీయ సంఘటనా మహామంత్రి ఆరా తీస్తుంటారు. రాష్ట్ర పార్టీ నాయకత్వాలు కాకిలెక్కలు చెబుతాయన్న అనుమానమే దానికి కారణం. కేంద్రపార్టీ.. రాష్ట్ర ఇన్చార్జి-సహ ఇన్చార్జి- రాష్ట్ర సంఘటనా మంత్రి వద్ద ఆ లెక్కలు ఆరా తీసి, ధృవీకరించుకుంటుంది. అందులో భాగంగా ఏపీ కో-ఇన్చార్జి సునీల్ దియోథర్ కూడా, విష్ణువర్దన్‌రెడ్డి ఇచ్చిన తలల లెక్కలను ‘గట్టిగా ధృవీకరించారట’.

విష్ణువర్దన్‌రెడ్డి చెప్పిన లెక్కలు నిజమయితే, ఆయనే చెప్పినట్లు ఏపీలో బీజేపీ బలం పెరిగినట్లే లెక్క. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లు మొత్తం ఓట్లు 2 లక్షలు కూడా లేవు. ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా వచ్చిన దాఖలాలు లేవు. మరి ఒక్కసారిగా బీజేపీ బలం, లక్షల్లో పెరగడం ఆశ్చర్యమే. ఈ ఊపు, ఉత్సాహం చూస్తుంటే.. సోము వీర్రాజు చెప్పినట్లు ఏపీలో సర్జికల్ స్ట్రైక్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదేమో?!

ఏదేమైనా.. ఒక రాజకీయ పార్టీ సభలకు, ఖచ్చితంగా ఎంతమంది హాజరయ్యారనే ‘తలల లెక్కలు’ తయారుచేయడం మాత్రం, ఒక్క విష్ణువర్దన్‌రెడ్డికే చెల్లింది. అందుకే ఆయనను ‘ఏపీ ఆర్యభట్ట’ అనడంలో అతిశయోక్తి లేదేమో?!

LEAVE A RESPONSE