Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ ‘వారధి’ కార్యక్రమం

-మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి: ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదేశాల మేరకు బీజేపీ ‘వారధి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు తమ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు ప్రభుత్వం మధ్య వారధిగా వ్యవహరిస్తూ సమస్యలను పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం” అని పేర్కొన్నారు.

“ప్రజలు తీసుకొస్తున్న సమస్యల్లో ఎక్కువగా ఆరోగ్య శాఖకు సంబంధించినవి, భూ సమస్యలు, ఇతర సమస్యలు వస్తున్నాయి. వాటిని సంబంధిత శాఖ అధికారుల వద్దకు పంపించి పరిష్కరించే ప్రయత్నం జరుగుతోంది” అన్నారు.

“త్వరలో ప్రభుత్వ హాస్పిటళ్ల రూపురేఖలను మార్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈ మార్పుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం” అని చెప్పారు.

అచ్చుతాపురంలో జరిగిన ప్రమాదం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందని మంత్రి పేర్కొన్నారు. “ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఘటనలో మృతి చెందిన వారికీ 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించాం” అని అన్నారు.

LEAVE A RESPONSE