-అల్ప సంఖ్యాకులైన క్రైస్తవులు, ముస్లింల హక్కులను కాల రాయొద్దు
-బీజేపీ నేతలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హితవు
మంగళగిరి: నగరంలో క్రైస్తవ సోదరుల కోసం నిర్మించ తలపెట్టిన బాప్తిజం ఘాట్ నిర్మాణ పనులను అడ్డుకొని వారి హక్కులను కాల రాయడం బిజెపి నేతలకు తగదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు ఛానల్ వెంబడి నిర్మించి తలపెట్టిన బాప్తిజం ఘాట్ నిర్మాణ పనులను, సోమవారం బిజెపి నేతలు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్కే బాప్తిజం ఘాట్ నిర్మాణ పనులను అడ్డుకున్న బిజెపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయ లబ్ధి కోసమే బిజెపి నాయకులు బాప్తిజం ఘాట్ నిర్మాణ పనులను అడ్డుకున్నారని, స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు డబ్బులు ఇచ్చి వారిని ప్రోత్సహించారనే విషయం కూడా, తనకు స్థానిక ప్రజల ద్వారా తెలిసిందన్నారు.
నగరంలో అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్నామని, ఈ నేపద్యంలో ఇటువంటి గందరగోళ పరిస్థితులు సృష్టించడం తగదన్నారు. మత మార్పిడి అనేది మనసుకు ,వ్యక్తికి సంబంధించిన విషయమని దానికి అవకాశం భారత రాజ్యాంగమే కల్పించిందనే విషయాన్ని, బిజెపి నేతలు తెలుసుకోవాలన్నారు. భారతదేశం లౌకిక రాజ్యమని, బైబిల్ లో వ్రాయబడినట్లుగా క్రైస్తవులు బాప్తిజం తీసుకుంటే మీకు అభ్యంతరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.
ఒకవేళ నిజంగా మతమార్పిడి జరుగుతుంటే మత మార్పిడిలు చేయడానికి వీలులేదని, భారతదేశం హిందూదేశం అని ప్రకటించి అందుకు అనుగుణంగా బిజెపి ప్రభుత్వం చట్టం తీసుకువస్తే ఆ చట్టాన్ని అందరూ గౌరవించి అనుసరిస్తారన్నారు. మత మార్పిడి సాకుతో అల్పసంఖ్యాకులుగా ఉన్న క్రైస్తవుల పై గానీ, ముస్లింల పై గానీ, మరే ఇతర మతస్తులనైనా హింసించి ఇబ్బందులకు కలుగజేసే అవసరం మనకేం ఉందని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడిగా ఎన్నుకోబడిన తనను అన్ని కులాల వారు, అన్ని మతాలవారు తమ తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేస్తుంటారని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఓ ప్రజా ప్రతినిధిగా తనపై ఉంటుందన్నారు. అందులో భాగంగా క్రైస్తవ సోదరులు తమకు నగరంలో బాప్తిజం ఘాట్ ఏర్పాటు చేయాలని కోరుతూ గత ఏడెనిమిది నెలల క్రితం వినతిపత్రం అందజేశారని, సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు.
బాప్తిజం ఘాట్ నిర్మాణ విషయంలో గందరగోళం సృష్టించడం బీజేపీ నేతలకు భావ్యం కాదని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా తనను గానీ, నగర పాలక సంస్థ అధికారులను గాని సంప్రదించాలని కోరారు.