బాలాజీ యాదవ్ ద్వారా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి డబ్బు
– బూచేపల్లితో పాటు ప్రకాశంలో మరిన్ని మద్యం స్కామ్ చేపలు?
ఒంగోలు: రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న వేల కోట్ల మద్యం కుంభకోణంలో దర్శి శాసనసభ్యులు, వైసిపి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేరు సిట్ దర్యాప్తులో వెలుగు చూడడం జిల్లాలో కలకలం రేపుతుంది. కల్తీ మద్యంతో వేలాది మంది పేదల ప్రాణాలను బలిగొన్న అక్రమ మద్యం స్కామ్ డబ్బులను ఓటర్లకు పంచే శివప్రసాద్ రెడ్డి గెలిచాడనే వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఎన్నికల్లో మద్యం స్కామ్ డబ్బులు అందజేసినట్లు వారి ఫోను సంభాషణలు ద్వారా రుజువైనట్లు సిట్ నిర్ధారిస్తుంది. 2024 ఏప్రిల్ నెలలో పొదిలిలో మకాం వేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు బాలాజీ యాదవ్ ద్వారా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి డబ్బు చేరవేసినట్లు ఫోను సంభాషణల ద్వారా రుజువుతుందని సిట్ పేర్కొంది.
ఈ స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కసిరెడ్డి సజ్జల భార్గవ రెడ్డి గోవిందప్పతో పాటు తాజాగా దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో భయం మొదలైంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసిన పార్లమెంట్ లో మిగిలిన అసెంబ్లీ అభ్యర్థులకు కూడా మద్యం స్కామ్ నగదు పంపిణీ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే జిల్లాలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ గెలిచారు. దర్శిలో శివప్రసాద్ రెడ్డి గెలిచారు. వీరిద్దరూ మద్యం అక్రమ సంపాదనతోనే ఎన్నికల్లో గెలిచారని ఎర్రగొండపాలెం ఇంచార్జి ఎరిక్షన్ బాబు గతంలో ఆరోపణలు కూడా చేశారు. ఆ ఆరోపణల కు బలం చేకూరే విధంగా నేడు సిట్ దర్యాప్తులో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు వెలుగులోకి రావడం సంచలనం కలిగిస్తుంది.
వైసీపీ ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న శివప్రసాద్ రెడ్డికి కూడా మద్యం కుంభకోణంలో పాత్ర ఉందనే ఆందోళన, భయం వైసీపీ కేడర్ ను వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరులు కొందరు ఆయనను కలిసి ఓదార్చే ప్రయత్నం చేయగా శివ ప్రసాద్ రెడ్డి -“నేను జైలుకు వెళ్లడం ఖాయం. మీరు ధైర్యంగా ఉండండి” అని చెప్పినట్లు తెలిసింది. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పేరు మద్యం కుంభకోణంలో చేరడంతో వైసీపీలోని మరికొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.