బ్రాహ్మణ ద్వేషి ‘మంచు’ కుటుంబాన్ని ‘మా’ ఎన్నికల్లో ఓడించాలి: శ్రీధర్ శర్మ
అమరావతి: బ్రాహ్మణ ద్వేషి ‘మంచు’ కుటుంబాన్ని “మా” ఎన్నికల్లో ఓడించాలని, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ జాతి నిత్య సాంప్రదాయల్ని, సంస్కృతిని అవమానిస్తూ తన సినిమాల్లో బ్రాహ్మణ జాతిని కించపరిచే సన్నివేశాలను నటుడు మోహన్‌బాబు ఎన్నో పెట్టారని విమర్శించారు. “దేనికైనా రెడీ” సినిమా వివాదంలో బ్రాహ్మణ పురోహితుల మీద దాడులు చేయించి.. బ్రాహ్మణ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టించి వేదనకు గురిచేశారని వాపోయారు. వీరిపై బ్రాహ్మణ జాతి ఆనాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉద్యమం చేసిందని తెలిపారు. బ్రాహ్మణ జాతికి కనీస క్షమాపణలు కూడా చెప్పని “మంచు మోహన్ బాబు, మంచు విష్ణు”లను “మా” ఎన్నికల్లో తప్పక ఓడించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో అందరి మేలుకోరి సర్వేజనా సుఖినోభావంతు అనే బ్రాహ్మణ జాతి.. మనోభావాలను అత్యంత హేయంగా దెబ్బతీసి అవమానించిన మంచు కుటుంబం.. తరతరాలుగా వారికి తగిలే బ్రాహ్మణ శాపాన్ని, ఆక్రోశాన్ని, ఆవేదనను.. “మా” ఎన్నికల్లో ఓడించి మరోమారు గుర్తుచేయాలి’’ అని శిరిపురపు శ్రీధర్‌శర్మ కోరారు.