Suryaa.co.in

యువ‌త‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లను చేరువ చేసేందుకే పోటీలు
Andhra Pradesh

యువ‌త‌కు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లను చేరువ చేసేందుకే పోటీలు

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి
న్యాయ‌నిర్ణేత‌లుగా ప్ర‌ముఖ గాయ‌ని ఎస్‌పి.శైల‌జ‌, టిటిడి ఆస్థాన విద్వాంసులు గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌.ఎస్వీబీసీలో అదివో.. అల్ల‌దివో.. కార్య‌క్ర‌మం ప్రారంభం.
ADIVO-ALLADIVO-SVBC-PROGRAME-AT-MAHATI-1శాస్త్రీయ సంగీతంలోని మాధుర్యాన్ని, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వైభ‌వాన్ని, అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల్లోని భ‌క్తిభావ‌న‌ను జ‌న‌బాహుళ్యంలో విస్తృత‌ప్ర‌చారం క‌ల్పించ‌డంతోపాటు యువ‌త‌కు చేరువ చేసేందుకే పోటీలు నిర్వ‌హిస్తున్నామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం తిరుప‌తిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో అదివో.. అల్ల‌దివో.. పేరుతో పాట‌ల పోటీల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శీర్షికా గీతాన్ని ఆవిష్క‌రించి ప్ర‌ద‌ర్శించారు.
ఈ కార్యక్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ ఇప్ప‌టివ‌ర‌కు 4 వేల సంకీర్త‌న‌లను రికార్డు చేసి టిటిడి వెబ్‌సైట్‌లో పొందుప‌రిచామ‌ని తెలిపారు. అయితే వీటిలో కొన్ని సంకీర్త‌న‌లు మాత్ర‌మే బ‌హుళ ప్ర‌జాద‌ర‌ణ పొందాయ‌ని, మిగిలిన సంకీర్త‌న‌ల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించామ‌ని వివ‌రించారు. ఇందుకోసం సుమారు 50 ఎపిసోడ్ల‌తో అదివో.. అల్ల‌దివో.. కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. అన్నమాచార్య సంకీర్తనలపై లోతైన విశ్లేషణ చేసి ప్ర‌తిప‌దార్థాలు, అర్థతాత్పర్యాలు, విశేషాంశాల‌తో భక్తులకు అందుబాటులో ఉంచేందుకు కృషి జ‌రుగుతోంద‌ని తెలిపారు.
ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి సంక‌ల్పం, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రోత్సాహంతో కొత్త‌, పాత సంకీర్త‌న‌ల మేలు క‌ల‌యిక‌తో ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌న్నారు. ఇందులో 15 నుండి 25 సంవ‌త్స‌రాల యువ‌తీ యువ‌కులు పాల్గొంటార‌ని చెప్పారు. అన్న‌మ‌య్య‌, పెద తిరుమ‌ల‌య్య‌, చిన తిరుమ‌ల‌య్య కుటుంబమంతా సంగీత‌, సాహిత్య సేవ‌లో త‌రించార‌ని తెలిపారు.
ADIVO-ALLADIVO-SVBC-PROGRAME-AT-MAHATI-4టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులు గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ 600 సంవ‌త్స‌రాల పూర్వం అన్న‌మ‌య్య త‌న సంకీర్త‌న‌లు ర‌చించార‌ని, అప్ప‌టినుండి 150 ఏళ్ల వ‌ర‌కు శిష్య‌ప‌రంప‌ర‌, కుటుంబ స‌భ్యుల ద్వారా ప్ర‌చారం పొందాయ‌ని, ఆ త‌రువాత క‌నుమ‌రుగ‌య్యాయ‌ని చెప్పారు. సుమారు వంద సంవ‌త్స‌రాల క్రితం అన్న‌మ‌య్య సాహిత్యంపై టిటిడి దృష్టి సారించింద‌ని, ఆ త‌రువాత అప్ప‌టి ఈవో  పివిఆర్‌కె.ప్ర‌సాద్ హ‌యాంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు ప్రారంభ‌మైంద‌ని వివ‌రించారు. రాళ్ల‌ప‌ల్లి అనంత‌కృష్ణ‌శ‌ర్మ‌, ప‌శుప‌తిజాన‌కీరామ‌న్‌,  నేదునూరి కృష్ణ‌మూర్తి లాంటి ప్ర‌సిద్ధ సంగీత‌కారులు బాణీలు క‌ట్టార‌ని, బాల‌ముర‌ళీకృష్ణ‌,  వింజ‌మూరి ల‌క్ష్మి లాంటి సుప్ర‌సిద్ధ గాయ‌కులు ఆకాశ‌వాణిలో పాడ‌డం ద్వారా విస్తృత ప్ర‌చారం ల‌భించిందని తెలియ‌జేశారు. యువ‌త‌ను ఆక‌ర్షించి సంకీర్త‌న‌ల వైపు మ‌ర‌ల్చి ప్ర‌చారం చేయ‌డం ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశ‌మన్నారు.
ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ మాట్లాడుతూ సంగీతాన్ని గాంధ‌ర్వ వేదం అంటార‌ని, ఇది సామ‌వేదానికి ఉప‌వేద‌మ‌ని తెలిపారు. సామ వేదంలోని 21 స్వ‌రాల్లో 7 స్వ‌రాల‌తో సంగీతం ఉద్భ‌వించింద‌న్నారు. తెలుగు సాహితీ సామ్రాజ్యంలో అన్న‌మ‌య్య ముందు వ‌రుస‌లో ఉంటార‌ని వివ‌రించారు.
జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉపకుల‌ప‌తి ఆచార్య వి.ముర‌ళీధ‌ర శ‌ర్మ మాట్లాడుతూ సంగీతానికి భ‌క్తిని జోడించ‌డం స‌నాత‌న ధ‌ర్మం గొప్ప‌ద‌న‌మ‌న్నారు. ఈ పోటీల వ‌ల్ల యువ‌త ఉద్యోగాన్వేష‌ణ‌కే ప‌రిమితం కాకుండా సంగీతంలో అభినివేశం క‌లుగుతుంద‌ని తెలిపారు. ఈ పోటీల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి నాద‌నీరాజ‌నం త‌దిత‌ర కార్య‌క్ర‌మాల్లో అవ‌కాశం క‌ల్పించాల‌ని, తద్వారా మ‌రింత మంది కొత్త క‌ళాకారులు త‌యార‌వుతార‌ని వివ‌రించారు.
అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ మాట్లాడుతూ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించేందుకు వీలుగా ఒక వైపు సంకీర్త‌న‌ల ప‌రిష్క‌ర‌ణ‌, మరోవైపు రికార్డింగ్ ప్ర‌క్రియ వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. శ్రీ‌వారి వైభ‌వాన్ని వ్యాప్తి చేసేందుకు వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం గ్రంథాన్ని ప్ర‌చారంలోకి తీసుకురావాల‌న్నారు. సంకీర్త‌న‌ల‌కు అర్థ‌తాత్ప‌ర్యాలు, విశేషాంశాలు రాసే ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంద‌ని, ఉగాది నాటికి అధ్యాత్మ సంకీర్త‌న‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని తెలిపారు.
అదేవిధంగా, ప్ర‌ముఖ సంగీత క‌ళాకారులు పారుప‌ల్లి రంగ‌నాథ్‌, వేదవ్యాస ఆనంద‌భ‌ట్ట‌ర్ మాట్లాడుతూ అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఆల‌పించ‌డం పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌న్నారు. యువ క‌ళాకారులు వీటిని ఆల‌పించి, ఆస్వాదించి, ప్ర‌చారం చేయాల‌ని కోరారు.
అనంత‌రం పాటల పోటీల కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. మొద‌టిరోజు 12 మంది యువతీ యువ‌కులు ప‌లు సంకీర్త‌న‌లు ఆల‌పించి పోటీల్లో పాల్గొన్నారు. గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌, ప్ర‌ముఖ నేప‌థ్య‌గాయ‌ని  ఎస్‌పి.శైల‌జ న్యాయ‌నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో జి.సురేష్‌కుమార్‌, సిఏవో శేష‌శైలేంద్ర‌, డిఎఫ్‌వో శ్రీ‌నివాసులురెడ్డి, డెప్యూటీ ఈవో ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, పిఆర్వో డా. టి.ర‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE