* ఏషియన్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో భారత జట్టుకు నాలుగు పతకాలు
* ఏపీ సాఫ్ట్ టెన్నిస్ సంఘ ప్రధాన కార్యదర్శి దిలీప్
విజయవాడ: కొరియాలో ఈ నెల 13 నుండి 23 వరకు జరిగిన 9వ ఏషియన్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో భారత జట్టు నాలుగు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.దిలీప్ కుమార్ తెలిపారు. మిక్సిడ్ టీమ్, పురుషుల టీమ్, మిక్సిడ్ డబుల్స్, పురుషుల వ్యక్తిగత సింగిల్స్ విభాగాల్లో పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు.
విజయవాడకు చెందిన ఎన్.అనూష భారత సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి మిక్సిడ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. అనూష ఇప్పటికే ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనూషను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వి.శ్రీనుబాబు, కోశాధికారి బి.నీరజ, వివిధ జిల్లాల సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.