Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్ -కాంగ్రెస్ పార్టీలవి ఒకే డీఎన్ఏ

– పాలనలో కేసీఆర్-రేవంత్ రెడ్డి కవల పిల్లల్లాంటివారు
– బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుటుంబ, అహంకార పాలన
– కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యంపై బీజేపీ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాల పాటు పోరాటం చేశాం. అనేక బలిదానాలు జరిగాయి. సకలజనుల సమ్మె చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గతంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ, అహంకార, అవినీతి పాలనతో తెలంగాణ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 420 హామీలు గుప్పించారు.

ఏడాది పాలన గడిచినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతోంది. బీఆర్ఎస్ -కాంగ్రెస్ పార్టీలవి ఒకే డీఎన్ఏ. ఒకే తానుముక్కలు. పాలనలో కేసీఆర్-రేవంత్ రెడ్డి కవల పిల్లల్లాంటివారు.

బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుటుంబ, అహంకార పాలన కొనసాగిస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. డిసెంబరు 9న సోనియా జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు 2000 రూపాయల నుంచి 4 వేలు చేస్తామని హామీలిచ్చారు. రుణమాఫీ పూర్తిచేయలేదు. పెన్లన్లు రూ. 4 వేలకు పెంచలేదు. ఒక కొత్త పెన్షన్ కూడా ఇయ్యలేదు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 12 నెలలు గడిచింది. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు ఇస్తే, బిజెపి కి 8 సీట్లలో గెలిపించారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ఉద్యమ శంఖారావం పూరించాం. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి బిజెపి జెండా ఎగురవేసేంత వరకు పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం బిజెపి అంకితభావంతో పనిచేస్తుంది. తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలు.. అందరూ భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను.

LEAVE A RESPONSE