Suryaa.co.in

National Telangana

రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరాలి: కేసీఆర్‌

కర్నాకటలో రాబోయే ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి జెండా ఎగుర వేయాలని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సందర్భంగా పార్టీ పేరు మార్పునకు గల కారణాలు వివరించారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయిందని, తనకు రాజకీయం ఒక టాస్క్‌ వంటిదని పేర్కొన్నారు.

దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్న కేసీఆర్‌.. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టీఆర్‌ఎస్‌ను రాష్ట్రానికే పరిమితం చేస్తే అని చాలా మంది తనను అడిగినట్లు చెప్పారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని, తెలంగాణ మోడల్‌ దేశంలో అమలు కావాలని కేసీఆర్‌ చెప్పారు. బంగ్లాదేశ్‌కంటే వెనుకబడడమేంటని ప్రశ్నించారు. దేశ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ను తీసుకువచ్చినట్లు వివరించారు. రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు.

విదేశాల నుంచి ప్రాసెసింగ్‌ ఫుడ్‌ను దిగుమతి చేసుకోవడం దారుణమన్నారు. కర్నాటక, మహారాష్ట్ర మన మొదటి కార్యక్షేత్రాలని తెలిపారు. తొలుత అక్కడి రైతులకు మేలు జరిగేలా మొదట ప్రయత్నిద్దామన్నారు. సమావేశానికి సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ను రావొద్దని చెప్పామని, ములాయం సింగ్‌ యాదవ్‌ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు కేసీఆర్‌. త్వరలోనే అందరూ కలిసి వస్తారని కేసీఆర్‌ చెప్పారు.

వచ్చే ఏడాదిలో కర్నాటకలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. కర్నాటకలో జెండా ఎగురవేయాలన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ కర్నాటకలో జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. జేడీఎస్‌ ఎమ్మెల్యేలు దేశమంతా కేసీఆర్‌తో కలిసి తిరుగుతారని తెలిపారు. తెలంగాణ పథకాలు బాగున్నాయన్న ఆయన.. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలన్నారు. కేసీఆర్‌ విజన్‌ ఉన్న నాయకుడని, బీఆర్‌ఎస్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నానన్నారు.

LEAVE A RESPONSE