-లక్ష్మీ నరసింహస్వామి మొక్కు చెల్లించాలి
-ఆలేరు సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
ఆలేరులో బీఆర్ఎస్ ను ఓడించాలి… లక్ష్మీ నరసింహస్వామి మొక్కు చెల్లించాలి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆలేరు ఎమ్మెల్యే కుటుంబం పేదల భూములు గుంజుకుని… ఆక్రమణలకు పాల్పడింది. ఆ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా ఎమ్మెల్యే మోసం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆలేరులో నిర్వహించిన విజయభేరి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ ను గెలిపించడం… బీఆరెస్ ను బొందపెట్టడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి. “రూ.2 లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7300 కోట్లకు కేసీఆర్ అమ్ముకుండు. ప్రశ్నా పత్రాలను లీక్ చేసి 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చేలాగాటమాడిండు. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేసిండు. నిరుద్యోగుల గురించి ఏ ఒక్కరోజైనా కేసీఆర్ ఆలోచన చేశారా? అమరుల కుటుంబాలకు ఏనాడైనా పిలిచి బుక్కెడు బువ్వ పెట్టిండా” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పదేళ్లు ఓపిక పట్టాం.. ఇక సహించేది లేదు..మీరు అనుకుంటే ఢిల్లీలో మోదీని.. గల్లీలో ఈ కేడీని బండకేసి కొట్టగలరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ మనోడు కాదు… పగోడు.. ఈ పగవాడిని పొలిమేరలు దాటే వరకు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ దొంగనోటు లాంటివాడు… జేబులో పెట్టుకుంటే జైలుకే. కేసీఆర్ కు నేను మాట ఇస్తున్నా… ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
“జూబ్లీహిల్స్ ఓ అధికారి ఇంట్లో కేసీఆర్ వెయ్యి కోట్లు దాచిండు..కాంగ్రెస్ పిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు…ఓటుకు పదివేలు పంచి కేసీఆర్ గెలవాలని చూస్తుండు.. కేసీఆర్ ఇచ్చే పదివేలలో ఒక్క రూపాయి తగ్గినా మీ ఎమ్మెల్యే మింగినట్టే..వాళ్లు ఇచ్చినదంతా తీసుకోండి… కాంగ్రెస్ ను గెలిపించండి” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. 50వేల మెజారిటీతో ఆలేరులో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.