Suryaa.co.in

Telangana

రైతు బంధుకు వచ్చిన అనుమతి.. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు రాలేదు?

-ఈ నెల కేసీఆర్ వేసే రైతు బంధు 10 వేలే.. వచ్చే నెల కాంగ్రెస్ వస్తే 15 వేలు
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

రైతు బంధుకు అనుమతి తీసుకురాగలిగిన బీఆరెస్, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తీసుకురాలేకపోయారు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జుక్కల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ బంధు మైనారిటీ బందుకు ఎందుకు? ఇందుకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “రైతు బంధు కు అనుమతి ఇస్తే సంతోషమే

దళిత బంధు అమలుకు కేసీఆర్ ఎందుకు ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకోవడం లేదో జవాబివ్వాలి” అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దళితబందు, బీసీ బందు, మైనారిటీ బందు ఇచ్చే వరకు…బీఆరెస్ నాయకులు గ్రామాలకు రానివ్వకండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల కేసీఆర్ వేసే రైతు బంధు 10 వేలే.. వచ్చే నెల కాంగ్రెస్ వస్తే 15 వేలు అన్నారు. బీజేపీ, బీఆరెస్ కుట్ర చేసి రైతులకు నష్టం చేస్తాయన్నారు. అయినా సరే…కాంగ్రెస్ రాగానే మిగిలిన డబ్బులు రైతులకు చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటే.. బీజేపీకి ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అని విమర్శించారు.

విద్యార్థులు, ఉద్యమకారులు తెలంగాణ సాధిస్తే ఈ రోజు కేసీఆర్ అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. “బీఆరెస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు… రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందే.. కేసీఆర్ నీళ్లు ఇచ్చింది నిజమే అయితే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పాడావు పడింది. కేసీఆర్ ను ఆనాడు ఎంపీగా గెలిపించినా… ఈంప్రాంతానికి చేసిందేం లేదు. తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న దళితుల్ని విస్మరించారు.

కేసీఆర్ బక్కోడు కాదు లక్ష కోట్లు, 10వేల ఎకరాలు దోచుకున్న బకాసురుడు. ప్రజలను నమ్మించి మోసం చేసి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు.. ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు అయిన్రు. కేసీఆర్ కు చర్లపల్లిలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినపుడే మన గౌరవం పెరుగుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

LEAVE A RESPONSE