మహిళా రిజర్వేషన్స్ బిల్లుపై లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ రాజ్యసభను స్తంభింపజేసిన బీఆర్ఎస్
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్లచొక్కాలు ధరించి పార్లమెంటుకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు
రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఉపసంహరించాలంటూ కాంగ్రెసు సహా విపక్షాలు డిమాండ్ మహిళా రిజర్వేషన్స్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలంటూ లోకసభను,అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ రాజ్యసభను బీఆర్ఎస్ సభ్యులు స్తంభింపజేశారు. తమ డిమాండ్స్ పై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను అధికార పక్షం తిరస్కరించింది. దీంతో, నల్లచొక్కాలు, కండువాలు ధరించి సమావేశాలకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులు చర్చకు పట్టుబడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,తన సహచర ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి,కే.ఆర్.సురేష్ రెడ్డి,బడుగుల లింగయ్యలతో కలిసి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎండగడుతూ ఆందోళనలో పాల్గొన్నారు.లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎంపీలు మాలోతు కవిత, బోర్లకుంట వెంకటేష్ నేతకాని, పసునూరి దయాకర్,మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీ.బీ.పాటిల్, పీ. రాములు తదితరులు మహిళా రిజర్వేషన్స్ బిల్లుపై చర్చకు పట్టుబట్టారు.అలాగే, రాహుల్ గాంధీపై అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని కోరుతూ కాంగ్రెస్ తదితర పక్షాలు ఆందోళనకు దిగడంతో అధికార పక్షం ససేమిరా అంటూ ఉభయ సభలను మధ్యాహ్నాం 2గంటలకు వాయిదా వేసింది.