– బీజేపీపై బీఆర్ఎస్ ఆపరేషన్
-తొలిసారి బీఎల్ సంతోష్ పేరు తెరపైకి
– ఉత్తరాది ఫిరాయింపుల్లోనూ వినిపించని బీఎల్ పేరు
– ఆయనది ఎప్పుడూ తెరవెనుక వ్యవహారమే
– బీజేపీలో కీలకపాత్ర ఆయనదే
– బీజేపీకి మార్గదర్శకుడు ఆయనే
– రామచంద్రభారతి నోటి వెంట సంతోష్ ప్రస్తావన
– మోదీ-షా కంటే పవర్ఫుల్ అని కితాబు
– ఫలితంగా ఎమ్మెల్యేల ట్రాప్‌కేసులో తొలిసారి ఆయన పేరు
-లిక్కర్ కేసు తర్వాత కేసీఆర్ టిట్ ఫర్ టాట్
– ఈడీ దూకుడుకు కేసీఆర్ బ్రేకులు వేసినట్టేనా?
– ఢిల్లీ లిక్కర్ కేసు కథ ఇక కంచికేనా?
– కేసీఆర్ దెబ్బకు కమలిన కమలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన బీజేపీలో అత్యంత శక్తిశాలి. ఆర్ఎస్ఎస్ పక్షాన పార్టీకి దిశానిర్దేశం చేసే మార్గదర్శకుడాయన. ప్రభుత్వంలో మోదీ-అమిత్‌షా నెంబర్ వన్,టూలయితే.. ఆయన పార్టీలో నెంబర్ వన్. పార్టీ పదవుల నుంచి రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు వరకూ ఆయన చెప్పిందే వేదం. కేంద్రమంత్రులకు సైతం ఆయన అపాయింట్మెంట్ అంత సులభంగా దొరకదు. ఆయనకు తెలియకుండా బీజేపీలో చీమకూడా కదలదు. నామినేటెడ్ పదవులు-రాష్ట్ర పార్టీ అధ్యక్షులు-ఇన్చార్జిలు-సంఘటనామంత్రుల నియామకాలన్నీ ఆయన కనుసన్నలలోనే నడుస్తాయి. ఆయన అంత పవర్ఫుల్ మరి. అయినా సరే.. ఎప్పుడూ తెరపైకి కనిపించరు. అంతా తెరచాటు వ్యవహారాలే. అంత శక్తివంతుడు, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్
పన్నిన ఉచ్చులో చిక్కుకున్నారు. ఫలితంగా.. పార్టీ ఫిరాయింపు వ్యవహారానికి సంబంధించి టీఆర్ఎస్ వేసిన ట్రాప్‌లో తనకు తెలియకుండానే ఇరుక్కుపోయారు. ఢిల్లీ దూతల ప్రస్తావనలో ఆయన పేరు దొర్లడమే అందుకు కారణం. ఆయనే బీఎల్ సంతోష్. బీజేపీ నేతల భాషలో ఆయన జాతీయ సంఘటనా మహామంత్రి. సంస్థాగతంగా బీజేపీ కార్యనిర్వహక జాతీయ ప్రధాన కార్యదర్శి.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొను‘గోల్మాల్’ వ్యవహారం, రోజుకో ఆసక్తికర మలుపు తిరుగుతోంది. రోజుకో ఆడియో లీక్ అవుతోంది. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించిన ముగ్గురిని, అదుపులోకి తీసుకోమన్న ఆదేశాలతో కథ కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును టీఆర్ఎస్ను బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యంలో జరిగిన, తొలి మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా కేసుతో, అనేక పరిణామాలు తెరపైకి- తెరవెనక్కి వెళ్లే అవకాశాలు లేకపొలేదన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరు తెరపైకి రావడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. గోవా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఫిరాయింపులు జరిగినప్పుడు కూడా, సంతోష్ పేరు ఎప్పుడూ తెరపైకి రాలేదు. సహజంగా ఇలాంటి కీలక వ్యవహారాలు, సంతోష్ స్థాయి వ్యక్తులకు తెలియకుండా జరగవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీకి సంబంధించినంత వరకూ, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారాల్లో ఎలాంటి సమస్య రాలేదు. వాటిలో సంతోష్ పేరు ఎక్కడా బయటకు రాలేదు. నిజానికి చాలామందికి సంతోష్ గురించి, ఆయన పాత్ర గురించి తెలియదు. జాతీయ సంఘటనా మహామంత్రులు బయటకు రాకపోవడమే దానికి కారణం. వారిదంతా తెరవెనుక ఉండి నడిపించే పాత్ర కావడంతో మీడియా వర్గాలకు గానీ, ఇతర పార్టీ నాయకత్వాలకు గానీ ఆయన పాత్ర తెలిసే అవకాశం ఉండదు.
కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో మాత్రం.. తొలిసారి సంతోష్ పేరు బయటకు రావడం, సహజంగానే బీజేపీకి ఇబ్బందిగా మారింది. బీజేపీలో మోదీ-అమిత్‌షా కంటే, కీలకమైన స్థానంలో
ఆయన ఉండటమే దానికి కారణం. మరోవైపు బీజేపీని శ్వాసించి, శాసించే సంతోష్ పేరు బయటకు రావడం, ఆ పార్టీలోని మరికొందరు సీనియర్లకు ఆనందం కలిగిస్తోంది. సంతోష్ వల్ల రాజకీయంగా నష్టపోయిన పార్టీ సీనియర్లకు, ఈ పరిణామాలు సహజంగానే ఆనందం కలిగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయనకు ముందున్న సంఘటనా మహామంత్రులు, తమ వద్దకు వచ్చే పార్టీ నాయకులను కలిసేవారు. కానీ సంతోష్ మాత్రం, ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వరన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఏపీ-తెలంగాణకు చెందిన అనేకమంది మాజీ ఐఏఎస్-ఐపిఎస్‌లు బీజేపీలో చేరారు. వారంతా సంతోష్ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూసినా, ఆయన దర్శనం లభించలేదు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక అభ్యర్ధిగా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా, రత్నప్రభను ఏకపక్షంగా ఎంపిక చేశారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి.
ఇక దేశంలోని అనేక రాష్ట్రాలకు అధ్యక్ష పదవుల నియామకంలోనూ, సంతోష్ సమర్ధులను ఎంపిక చేయలేదన్న విమర్శలు లేకపోలేదు. అయినా ఆయన ఎదురులేకుండా ఆ పదవిలో కొనసాగుతున్నారంటే, ఆరెస్సెస్‌లో సంతోష్ ఎంత బలమైన స్థానంలో ఉన్నారో స్పష్టమవుతోంది. అంత
శక్తివంతమైన పాత్ర పోషిస్తున్న సంతోష్ పేరు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెరపైకి రావడం, బీజేపీని రాజకీయంగా చిక్కుల్లో నెట్టింది. ఘజియాబాద్‌కు చెందిన రామచంద్రభారతి.. తనకు సంతోష్‌తో సన్నిహిత సంబంధాలున్నట్లు చెప్పడటం, సెల్ఫోన్లో సంతోష్ బీజేపీ అని ఉండటం బీజేపీని రాజకీయంగా ఇరుకునపెట్టేవే. పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, సంతోష్ స్థాయి గురించి రామచంద్రభారతి చాలా గొప్పగా వివరించారు. అయితే సంతోష్ గురించి రామచంద్రభారతి చెప్పినవి వాస్తవాలే అయినప్పటికీ, తనకు ఆ స్థాయి నేతలతో పరిచయం ఉందని చెప్పడమే రామచంద్రభారతి ఉద్దేశంగా కనిపిస్తుంది.
తాజా పరిణామాల్లో తెలంగాణ బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడి చేస్తున్నా, బీజేపీ రాజకీయంగా దెబ్బతిందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. లీకయిన తొలి వీడియో బోగస్ అని ప్రచారం చేసిన బీజేపీ నేతలు, రెండో ఆడియో విడుదలయిన తర్వాత దాడి తీవ్రత తగ్గించడం ప్రస్తావనార్హం. సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా రోజుకో ఆడియో టేపులు లెక్ చేయిస్తుండటంతో, ఎప్పుడు ఎన్ని ఆడియో-వీడియోలు బయటకు వస్తాయన్న ఆందోళన బీజేపీ నాయకత్వాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పటివరకూ ఆడియోలే తప్ప, వీడియోలు బయటకు రాలేదు. ఇకపై అవి కూడా బయటకు వస్తే, పార్టీకి ఇబ్బందేనన్న ఆందోళన బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
వారి టేపులు ఒకవేళ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపిస్తే, పార్టీ మరిన్ని ఇబ్బందుల్లో పడటం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఇద్దరు స్వాములు, నందు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తే.. అందులో రామచంద్రభారతి-సంతోష్ గత సంభాషణలు, నెంబర్లు బయటపడే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన, బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తాజా పరిణామాలు పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కరు కేసు కథ, కంచికి చేరినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ చేతిలో ఎమ్మెల్యేల కేసు కథ ఉన్నంతవరకూ, బీజేపీ నాయకత్వం ఢిల్లీ లిక్కరు కేసును ముందుకు నడిపించకపోవచ్చంటున్నారు. అసలు కేసీఆరే, ఈ కథ నడిపించారన్న ప్రచారమే
నిజమైతే, ఆయన బీజేపీని భారీగా దెబ్బకొట్టినట్లేనని విశ్లేషిస్తున్నారు. బీజేపీ నాయకత్వం ఢిల్లీ లిక్కరు కేసులో ఒక అడుగు ముందుకేస్తే.. కేసీఆర్ ఎమ్మెల్యేల బేరసారాల కేసులో , రెండడుగులు ముందుకు వేయడం ఖాయమంటున్నారు. బీఆర్ఎస్ పేరుతో అడుగులు వేస్తున్న కేసీఆర్‌కు బీజేపీ దొరికిందన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ శిబిరం నుంచి వినిపిస్తున్నాయి. కేసీఆర్ మాదిరిగా ఏ పార్టీ బీజేపీకి ఈవిధంగా చెక్ పెట్టలేకపోయిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.