Suryaa.co.in

Telangana

దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయాలు చూపనున్న బీ.ఆర్.ఎస్

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీ దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయాలు చూపనుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.దేశ సర్వతోముఖాభివృద్దే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం అని, ఆ దిశలో బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందుకు సాగుతున్నారని వినోద్ కుమార్ తెలిపారు.

బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 7 మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి నిరూపించామని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వ మంత్రులు ప్రతినిత్యం కితాబు ఇచ్చే పరిస్థితి చూస్తున్నామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా అందుకోవాలని బి.ఆర్.ఎస్ పార్టీ లక్ష్యం అని వినోద్ కుమార్ అన్నారు.టిఆర్ఎస్ పార్టీ స్థాపించే ముందు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని కెసిఆర్ చెప్పారని ప్రజా ఉద్యమాల ద్వారా అన్ని వర్గాల సహకారంతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించి చూపామని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

భారత్ రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీ ద్వారా కూడా దేశంలో విప్లవాత్మక, గుణాత్మక మార్పులను చేసి చూపిస్తామని వినోద్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం సరిహద్దున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి… తెలంగాణతో కలిసి ఉంటామని చెబుతున్నారని వినోద్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రజాస్వామిక దేశంలో ప్రశ్నించే గొంతుకలు ఉండాలని, చరిత్ర తెలిసిన వారే చరిత్ర వీరులు అవుతారని వినోద్ కుమార్ అన్నారు.తెలంగాణ అభివృద్ధిని ఓర్వ లేక అడ్డు పాడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓర్వలేకపోతుందని, తెలంగాణ రాష్ట్రానికి నిధులు, రుణాలు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ సంపదను అదాని అంబానీలకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతోందని ఆయన అన్నారు. దేశంలోని బ్యాంకులను కోట్లాది రూపాయలు నిండా ముంచిన ఘనులు దర్జాగా విదేశాల్లో జల్సాలు చేస్తున్నారని, కేంద్రంలోని ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తోందని వినోద్ కుమార్ అన్నారు. ఇలాంటి విషయాలను ఎక్కడికక్కడ చర్చ పెట్టాలని, ప్రజలకు వాస్తవాలను వివరించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులను అప్పులు చేసి నిర్మించామని, అయితే ఈ అప్పులను పెట్టుబడులుగా చూడాలని వినోద్ కుమార్ ఉన్నారు. ఈ అప్పులను అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే వెచ్చించామని కానీ జీతభత్యాలు పెంచల కోసం కాదు అని వినోద్ కుమార్ అన్నారు.

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి బీ ఆర్ ఎస్ పుట్టుక వరకు పరిణామాలను వినోద్ కుమార్ సవివరంగా కార్యకర్తలకు చెప్పారు.హుస్నాబాద్ ఎమ్మెల్యే వీ. సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఏడు మండలాల స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

LEAVE A RESPONSE