– కాలం చెల్లిన నినాదాలు.. వివాదాలే వారికి ఉనికి
(చాకిరేవు)
ఏడవకుండా సంతోషంగా ఎలా గడపాలో తెలియక.. నా కన్నీటిని పీల్చేసుకుంటావా అని చేతి రుమాలును ఎవరైనా తిడతారా?.. అలా ఉన్నాయి భారాస, కాంగ్రెస్ రాజకీయాలు.
జగన్ చేసిన ఉత్తుత్తి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన హడావిడిని ఎన్జీటీ ఆపకపోయినా.. రోడ్లలో గుంతలకు తట్టెడు మట్టిని వెయ్యని ఆయన ఒక చిన్న పిల్ల కాలువ కూడా తవ్వి ఉండడు. ఆయన పరిపాలనలో రోజూ హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు మొట్టికాయలు తినడంతోనే ఐదేళ్లు సరిపోయింది. అలాంటిది ఆయన పనులను అడ్డుకుని, ‘మేము ప్రతాపం చూపాము’ అని హరీశ్ రావు ప్రెజెంటేషన్లు ఇవ్వడం చూసి నవ్వుకోని రాజకీయ విశ్లేషకులు లేరు.
సముద్రం తెలంగాణ పక్కన లేదు. అదేమి విరహమో కానీ, దానిలోకి ఏటా మూడు వేల టీఎంసీల వరద నీటిని వదలాల్సిందే.. ఆ వరదలో కేవలం ఏడు శాతం అంటే 200 టీఎంసీల నీటిని ఆంధ్రా వాడుకున్నా.. ‘మన తెలంగాణ ప్రజలంతా మాతో పాటు చంద్రబాబు మీద ఏడవాలి’ అనే హేయమైన, చౌకబారు రాజకీయం చేస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల మీద కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాజకీయ నాయకులు ఏడ్చి ఏడ్చి అలసిపోయారు. దశాబ్దం తర్వాత కూడా తమను ఆంధ్రాను చూసి ఏడవమంటే.. సాటి తెలుగు సోదరులుగా తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదును అభివృద్ధి చేసుకున్నాం, విభజనతో నష్టపోయాం అనే బాధను దిగమింగి.. మూడు ముక్కలాట ఆడిన వాడికి ఉప్పుపాతర వేసి, అటు వైజాగ్ నుండి ఇటు తిరుపతి వరకు 7 నుండి 8 భారీ పట్టణాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుని, దేశమే ఆశ్చర్యపోయేలా ఏపీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
వాస్తవం గ్రహించి.. విడిపోయాక పట్టిసీమతో.. కృష్ణా డెల్టాను ఎలా సస్యశ్యామలం చేశారో, కరువును జయించి రాయలసీమ హార్టికల్చర్లో దేశంలోనే అగ్రస్థానంలో ఎలా నిలిచిందో చూడాలి. మిగులు రాష్ట్రం కాకపోయినా.. జగన్ విధ్వంసం తర్వాత కూడా ఏపీ ఎలా జీడీపీ వృద్ధి వేగాన్ని పెంచిందో గమనించి, సాటి సోదర రాష్ట్రంగా అభివృద్ధిలో పోటీ పడితే అక్కడి జనం గుండెల్లో పెట్టుకుంటారు.
గోదావరి వరదను నల్లమల ద్వారా వీలైతే కర్ణాటక, తమిళనాడుకు మళ్లించి.. వారి కావేరి, తుంగభద్ర జలాలను ఇచ్చిపుచ్చుకునేలా అనుసంధానం చేసి, దేశాభివృద్ధికి తోడ్పడతాము, భాగస్వాములవుతాము అంటే.. కేంద్రం నుండి కోర్టుల వరకు ఆ ధర్మానికి ఎవరూ అడ్డుచెప్పరు. ఇప్పటికే కరెంటును అలా ఇతర రాష్ట్రాలకు ఇచ్చి పుచ్చుకుని కొనుగోలు భారాన్ని తగ్గించుకుని, ప్రజలకు పైసా భారం పడకుండా చూసుకుంటోంది.
కాలం చెల్లిన వివాదాలతో, రాజకీయ కుట్రలతో ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి, గిల్లీ కజ్జాలతో కాలక్షేపం చేస్తే.. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఉప్పుపాతర వేసి, మూడో ప్రత్యామ్నాయం వెతుక్కుంటారు.