• గత ఐదేళ్ళు బుడమేరు ఎరుగని జగన్
• నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చారు
• విపత్తుల సమయంలో జగన్ బాధితుల పక్షాన నిలబడలేదు
• ఐదేళ్ల పదవీకాలంలో సాయంత్రం 5 తరువాత బయటకు రాని జగన్
• ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజా హితం కోరాలి
• జగన్ రెడ్డి ఫేక్ ప్రచారం మానుకోవాలి… విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి
• చంద్రబాబు ఇంటికోసం బుడమేరు నీరు డైవర్ట్ చేశారని చెప్పడం జగన్ తెలివితక్కువతనం
• వరద బాధితుల కోసం నిలబడిన భగీరథుడు చంద్రబాబు
• యంత్రాంగం, నేతలు, హెలికాఫ్టర్లు, బోట్లు, డ్రోన్లతో యుద్ధప్రాతిపదికన పనులు
• ఇది చంద్రబాబు వలనే సాధ్యం
• అమరావతిపై తప్పుడు ప్రచారాలు సిగ్గుచేటు
• స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడంలో చంద్రబాబు పాత్ర కీలకం
• టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్
మంగళగిరి: దొంగే దొంగా దొంగా అన్నట్టు జగన్ తీరు ఉందని… గత ఐదేళ్లు బుడమేరును గాలికొదిలేసిన జగన్… నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు రావడం సిగ్గుచేటని.. బకాసురుల్లా ఇసుకను బొక్కి.. బుడమేరుకు గండ్లు కొట్టారని.. నేడు బెజవాడ ప్రజల కన్నీటి వ్యథకు వైసీపీ నేతలే ప్రధాన కారణమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ అన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
చెత్త రాజకీయాలు కాదు… ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజా హితం కోసం పనిచేయాలి. వైసీపీ మత్తులో ఉన్న అధికారులు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీనమేషాలు లెక్కేయడం క్షమించరాని నేరం. ముంపు ప్రాంతాలకు వచ్చిన జగన్ ప్రజలకు సాయం చేయకపోగా రాజకీయ బురద చల్లి వెళ్ళారు. విపత్తుల సమయంలో బాధితుల పక్షాన జగన్ ఒక్కరోజు కూడా నిలబడలేదు. ఐదేళ్ల పదవికాలంలో సాయంత్రం 5 తరువాత ఒక్క రోజు కూడా బయటకు రాలేదు. గత ఐదేళ్లలో ప్రజల క్షేమం కోసం జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు.
నేడు కలెక్టరేట్ లో బసచేసి బస్సులో నివాసం ఉంటూ.. చంద్రబాబు నేరుగా బాధితుల వద్దకు వెళ్ళి వారి కష్టాలను తెలుసుకుని వారి కన్నీళ్లను తుడుస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారు. జగన్ కుటిల బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. విమర్శలు చేస్తే అవి నిర్మాణాత్మకంగా ఉండాలి. కాని తప్పుడు ప్రచారం చేస్తారా? ముఖ్యమంత్రే స్వయంగా ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం వలన 10 ఎన్డీఆర్ ఎఫ్ టీమ్ లతో తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. అయినా తప్పుడు నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకోసం చంద్రబాబు పడుతున్న తపన మాకు గర్వకారణంగా ఉంది. ఎన్డీఆర్ ఎఫ్ టీమ్ లు, ఎలికాఫ్టర్లు, బోట్స్ తీసుకు వచ్చి నిరంతరం బాధితుల పక్షాన నిల్చోని చంద్రబాబు భరోసా కల్పిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు హర్షించాల్సిన విషయం.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు అందరూ బాధితులకు సహాయం చేస్తున్నారు. జగన్ రెడ్డి విమర్శలు చేసేప్పుడు ఆలోచించాలి. జగన్ రెడ్డి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే నాలుగుగోడల మధ్య ఉన్నారు తప్పా ఏనాడు బయటకు రాలేదు. పరదాలు చాటున తిరిగి, చెట్లు నరికించారు… వేల సంఖ్యలో పోలీసుల పహారాను పెట్టుకుని తిరిగారు. అలాంటి నేతలు మీరు మళ్ళీ విమర్శలు చేస్తారా? చంద్రబాబు నివాసం మునిగిపోతుందని… బుడమేరు నీరు డైవర్ట్ చేశారని నీచంగా అబద్దాలు చెబుతారా? అసలు బుడమేరు కట్టలు కోతకు గురవ్వడానికి మీ అక్రమ మైనింగే కారణం.
విజయవాడకు రిటైనింగ్ వాల్ టీడీపీ హయాంలోనే 90% పూర్తి చేశారు. అదే నేడు ప్రజలను కాపాడింది. అమరావతిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. 13 లక్షల క్యూసెక్ నీరు వచ్చినా అమరావతిలో ఎక్కడా నీరు నిలబడలేదు. గత ఐదేళ్లు అమరావతిపై అనేక ఆరోపణలు చేశారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడంలో చంద్రబాబు పాత్ర కీలకంగా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీని ప్రజలే పాతిపెడతారు.